Hyderabad Old City: హైదరాబాద్ పాతబస్తీ అభివృద్ధిపై కేటీఆర్ రివ్యూ

హైదరాబాద్ పాతబస్తీ (old city) అభివృద్ధిపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 11:03 PM IST

హైదరాబాద్ పాతబస్తీ (old city) అభివృద్ధిపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొలి రోజు నుంచి పాటుపడుతూ వస్తున్నదని, ఇప్పటికే హైదరాబాద్ నగరం నాలుగు దిశల విస్తరిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నదన్నారు. ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా నగరాన్ని నలు మూలల అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇప్పటిదాకా ఇదే అలోచనతో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం సభ పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ, చెవెళ్ల ఎంపి రంజిత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కూమారి, మున్సిపల్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అరవింద్ కూమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, జలమండలి, విద్యుత్ శాఖతో పాటు జిల్లా కలెక్టర్ మరియు వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హజరయ్యారు.

పాతబస్తీ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు ఈ సమావేశంలో అందజేశారు. జిహెచ్ఎంసి చేపట్టిన ఎస్సార్డిపి కార్యక్రమంలో భాగంగా పాతబస్తీ ప్రాంతంలోనూ భారీగా రోడ్డు నెట్వర్క్ బలోపేతానికి సంబంధించిన కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో ఇప్పటికీ పలు ఫ్లై-ఓవర్లు, రోడ్ల నిర్మాణం పూర్తయిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమం కింద దాదాపు వందల కోట్ల నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. జిహెచ్ఎంసి చేపట్టిన సిఆర్ఎంపి కార్యక్రమం ద్వారా ప్రధాన రోడ్ల నిర్వహణ కూడా ప్రభావవంతంగా కొనసాగుతున్నదని తెలిపారు. జనావాసాలు అధికంగా ఉన్న పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో రోడ్డు వైడనింగ్ కార్యక్రమం కొంత సవాల్ తో కూడుకున్నదని, అయితే రోడ్డు వైడనింగ్ తప్పనిసరి అయినా ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను అదేశించారు. పాతబస్తీలో చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం అవసరమైన మరిన్ని భూసేకరణ నిధులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ జంక్షన్ లతోపాటు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం, అవసరమైన చోట మూసీపై బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగంగా కొనసాగిస్తున్నదని తెలిపారు. చార్మినార్ పెడెస్ట్రియన్ ప్రాజెక్టు పనులు సైతం దాదాపుగా పూర్తి కావచ్చాయని తెలిపారు.

ప్రతి ఒక్కరికి సరిపడా తాగునీరు అందించాలన్న ఒక బృహత్ సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకుపోతున్నదని, అందులో భాగంగా హైదరాబాద్ నగరంలోని తాగునీటి సరఫరా సంతృప్తికర స్థాయిలో ఉందని కేటీఆర్ తెలిపారు. గత 8 సంవత్సరాలలో పాతబస్తీ పరిధిలోను తాగునీరు సరఫరా మెరుగుపడిందన్నారు. ఇందుకోసం వివిధ తాగునీటి సౌకర్యాల అభివృద్ది కోసం సుమారు 1200 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి సరఫరా పథకంలో భాగంగా పాతబస్తీలో రెండున్నర లక్షలకుపైగా నల్లా కనెక్షన్ల ద్వారా ఉచిత తాగునీరు అందుతుందని కేటీఆర్ తెలిపారు. జలమండలి ద్వారా మురికి నీటి వ్యవస్థ బలోపేతానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకోసం పాత బస్తి పరిధిలో వివిధ ప్రాంతాల్లో సీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు ఇతర కార్యక్రమాలను జలమండలి చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు.