లగ్చర్ల గిరిజన రైతుల పోరాటానికి సంఘీభావంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) గొప్ప నిర్ణయం తీసుకున్నారు. లగ్చర్లలో ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడిన జ్యోతి (Jyothi) కుమార్తెకు ‘భూమి నాయక్’ (Bhumi Nayak) అని పేరు పెట్టారు. కొద్దీ నెలల క్రితం లగ్చర్లలో ఫార్మా కంపెనీల కోసం భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. దీనికి గిరిజన రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పోరాటంలో జ్యోతి ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె గర్భిణిగా ఉన్నప్పటికీ భయపడకుండా తన భర్తకు న్యాయం కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదురించింది. రైతుల నిరసనలను పోలీసుల దమనకాండతో అణచివేయాలని ప్రభుత్వం యత్నించింది. గిరిజన రైతుల ఇళ్లపై దాడులు జరిగాయని, వారిపై పోలీసుల ద్వారా దౌర్జన్యం చేశారని ఆరోపణలు వచ్చాయి. కొందరు రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారని జ్యోతి మరియు ఇతర గిరిజన నాయకులు విమర్శించారు.
ఈ క్రమంలో జ్యోతి లగ్చర్ల పోరాటాన్ని దేశ రాజధానికి తీసుకెళ్లారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలతో కలిసి, ఎస్సీ/ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), మహిళా కమిషన్‌లను కలిసి తమ పరిస్థితిని వివరించారు. ఈ పోరాటానికి బీఆర్ఎస్ నేతలు పూర్తి మద్దతు తెలిపారు. కేటీఆర్ ఆమె ధైర్యాన్ని గుర్తించి జ్యోతి కుమార్తెకు ‘భూమి నాయక్’ అనే పేరును పెట్టారు. ఈ పేరు లగ్చర్ల రైతుల భూసంరక్షణ పోరాటానికి గుర్తుగా నిలుస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుల హక్కుల కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ పోరాడుతుందని, వారి బాధలు తీర్చేందుకు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.