“ముమ్మాటికీ మాది కుటుంబ పాలనే, బరాబర్ చెబుతున్నా అదే నిజం” అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని చెప్పారాయన. తెలంగాణలోని ప్రతి కుటుంబంలో సీఎం కేసీఆర్ భాగస్వామేనని అన్నారు. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నారని, ఆసరా పెన్షన్ తో వృద్ధులను కడుపులో పెట్టుకున్నారని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డలకు మేనమామ అయ్యారని వివరించారు. తెలంగాణలో అమలవుతున్న ప్రతి పథకం పేదవారికి లబ్ధి చేకూరుస్తోందని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణాలు దొరకట్లేదని, ఏ తప్పు దొరక్క చివరకు కుటుంబ పాలన అంటూ విమర్శిస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో రూ. 150 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేశారాయన. చిల్పూరు, ధర్మాసాగర్, వేలేరు మండలాలకోసం ఏర్పాటు చేస్తున్న మూడు ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. ధర్మాసాగర్, వేలేరు మధ్య 25కోట్ల రూపాయలతో నిర్మించిన డబుల్ రోడ్డుని ప్రారంభించారు. రూ.10కోట్లతో నిర్మించే మరో డబుల్ రోడ్డుకి శంకుస్థాపన చేశారు. సోడాషపల్లిలో పర్యటించిన అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్ ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు.