KTR Advises: యువతకు కేటీఆర్ ‘సోషల్’ పాఠాలు!

వచ్చే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యువతకు సూచించారు.

  • Written By:
  • Updated On - May 10, 2022 / 03:04 PM IST

వచ్చే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్‌పై దృష్టి సారించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ యువతకు సూచించారు. వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్‌ల కోసం సిద్ధమవుతున్న ఔత్సాహిక యువతకు నాణ్యమైన కోచింగ్‌ను అందించేందుకు పాలమూరు జిల్లాలో శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్‌లో కేటీఆర్ మాట్లాడారు. దాదాపు 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను నిర్ణీత కాలంలో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని,  కష్టపడి చదివి ఉద్యోగంలో చేరేందుకు యువతకు ఇదే అత్యుత్తమ అవకాశం అని ఆయన అన్నారు. ”రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టాలి. యువతను కోరుకుంటున్నదీ ఇదే. ఉద్యోగం వస్తే నీ జీవితమే మారిపోతుంది’’ అని కేటీఆర్ అన్నారు.

అనంతరం ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసిన కేటీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ ను కోరగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వినతిపై స్పందించిన మంత్రి ఈ విషయాన్ని తమ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహబూబ్‌నగర్ పట్టణంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, రానున్న రోజుల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణ రూపురేఖలు సమూలంగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతకుముందు పట్టణంలోని బస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను కేటీఆర్‌ ఎగురవేశారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంటేశ్వరరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.