Site icon HashtagU Telugu

Telangana Elections : టికెట్ దక్కని నేతలకు తీపి కబురు తెలిపిన కేటీఆర్

ktr-about-brs-candidates-list

ktr-about-brs-candidates-list

తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ నేడు ఎన్నికల బరిలో నిల్చుబోయే అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించింది. దాదాపు 115 మందితో కూడిన లిస్ట్ ను (BRS 115 Candidates List) ప్రకటించి వారిలో సంతోషాన్ని నింపింది. ముఖ్యంగా ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఇస్తారో లేదో అని చాలామంది ఖంగారుపడ్డారు. కానీ కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు మాత్రమే టికెట్‌ నిరాకరించి మిగతా వారికీ మరోసారి ఛాన్స్ ఇచ్చారు. టికెట్ వచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థులు సంబరాలు మొదలుపెట్టారు. ప్రతి నియోజకవర్గం లో కార్యకర్తలు , అభిమానులు టపాసులు కాలుస్తూ, స్వీట్స్ పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే టికెట్ దక్కని నేతలు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR) తీపి కబురు తెలిపారు.

ప్రస్తుతం కేటీఆర్ తన ఫ్యామిలీ తో కలిసి అమెరికా టూర్ లో ఉన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, మరోసారి తనను సిరిసిల్ల నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే టికెట్ దక్కని అభ్యర్థుల పరిస్థితిపైనా స్పందించారు. “ప్రజా జీవితంలో నిరాశా నిస్పృహలు ఎదురవుతుంటాయి. దురదృష్టవశాత్తు క్రిషాంక్ వంటి అర్హులైన, సమర్థులైన నేతలకు జాబితాలో చోటు కల్పించలేదు. క్రిషాంక్ కు, టికెట్ దక్కని ఇతర నేతలకు ప్రజా సేవ చేసేందుకు మరో రూపంలో అవకాశం దక్కేలా చూస్తాను” అని వారికీ హామీ ఇచ్చారు.

అలాగే ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (MLA Mynampally Hanumantha Rao) ఫై కేటీఆర్ ఫైర్ అయ్యారు. “మా ఎమ్మెల్యేల్లో ఒకరు తన కుటుంబ సభ్యులకు టికెట్ రాకపోవడంతో నోరు పారేసుకున్నారు… మంత్రి హరీశ్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ ఎమ్మెల్యే ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అంతేకాదు, మనందరం హరీశ్ రావుకు బాసటగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. హరీశ్ రావు (Harish Rao)… బీఆర్ఎస్ పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి అందులో అంతర్భాగంగా కొనసాగుతున్న వ్యవస్థాపక సభ్యుడు. పార్టీ ప్రస్థానంలో మున్ముందు కూడా ఆయన మూలస్తంభంలా వ్యవహరిస్తారు” అంటూ తన బావకు మద్దతు పలికారు.

ఇక టికెట్ దక్కని వారు ఎవరంటే..ఉప్పల్‌ సుభాష్‌ రెడ్డి స్థానంలో బండారు లక్ష్మారెడ్డికి, ఖానాపూర్‌లో రేఖా నాయక్‌ స్థానంలో జాన్సన్‌ రాథోడ్‌ నాయక్‌, బోధ్‌లో బాపురావు ప్లేస్‌లో అనిల్‌ జాదవ్‌కు టికెట్ ఇచ్చారు. ఇక వేములవాడలో చెలమనేని స్థానంలో లక్ష్మీనర్సింహరావుకు చోటు దక్కింది. వైరాలో రాముల నాయక్‌ ప్లేస్‌లో మదన్‌ నాయక్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజయ్య స్థానంలో కడియం శ్రీహరికి, అసిఫాబాద్‌లో ఆత్రం సక్కు స్థానంలో కొవ్వా లక్ష్మీకి టికెట్ ఇచ్చారు. కోరుట్లలో విద్యా సాగర్‌ రావు స్థానంలో ఆయన కుమారుడు సంజయ్‌కి టికెట్ ఇచ్చారు. అలాగే కంటోన్మెంట్‌ స్థానంలో కూడా సాయన్న కుమార్తె లాస్యకు స్థానం కల్పించారు. ఈ లెక్కన మొత్తం 9 మంది అభ్యర్థులు మారారు. ఇక కామారెడ్డితో కలుపుకుంటే మొత్తం 10 స్థానాలు మారాయి.

Read Also : Errabelli Dayakar Rao: వరసగా 8వ సారి బరిలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Exit mobile version