Konda Vishweshwar Reddy: డిగ్నిటీ ఆఫ్ ‘కొండా’

ఆయనో మాజీ ఎంపీ.. ఉన్నత విద్యావంతుడు, శ్రీమంతుడు కూడా.. అయితేనేం సకల సౌకర్యాలు పక్కన పెట్టి ప్రజా సేవకు శ్రీకారం చుడుతుంటారు.

  • Written By:
  • Updated On - May 19, 2022 / 01:56 PM IST

ఆయనో మాజీ ఎంపీ.. ఉన్నత విద్యావంతుడు, శ్రీమంతుడు కూడా.. అయితేనేం సకల సౌకర్యాలు పక్కన పెట్టి ప్రజా సేవకు శ్రీకారం చుడుతుంటారు. అధికారం అనేదే లేకపోతే.. ఏ నేత కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇష్టపడడు. ‘మనకెందుకులే’ అని ఇంటికే పరిమితమవుతుంటారు. ఎన్నికలు సమీపిస్తేకానీ.. జనం సమస్యలు గుర్తుకొస్తాయి. కానీ రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్టయిలే వేరు. అధికారం ఉన్నా.. లేకపోయినా ఇతరులకు సాయం చేసేందుకు ముందుంటారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సమస్యలను పరిష్కరించిన ఆయనను ప్రభుత్వ బడుల దుస్థితి కదిలించింది.

విద్యార్థులతో కళకళలాడిన పాఠశాలలు బోసిపోవడం చూసి చలించిపోయారు. కారణం ఏమైంటుందని స్వయంగా బడులకు వెళ్లి చూస్తే.. అక్కడి మరుగుదొడ్లు (టాయిలెట్స్) అపరిశుభ్రంగా, ఏమాత్రం పనికిరాకుండా కనిపించాయి. ఈ కారణంగానే పిల్లల అటెండెన్స్ తగ్గిపోతోందని భావించిన ఆయన ఓ మంచి పనికి నాంది పలికారు. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఈ కార్యక్రమం ద్వారా రంగారెడ్డి జిల్లాలోని 100కుపై ప్రభుత్వ పాఠశాలల మరుగుదొడ్లను శుభ్రపరిచి అటు విద్యార్థుల్లో, ఇటు ఉపాధ్యాయుల్లో, మరోవైపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల పనితీరు మెరుగుపడుతోంది. ‘డిగ్నీటి ఆఫ్ లేబర్ ద్వారా ఏం చేయబోతున్నారు’ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అడగ్గా.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.

‘‘ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న టాయిలెట్స్ శుభ్రంగా ఉండకపోతే పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతారు. ఆ కారణం వల్ల స్కూల్ కి సరిగ్గా పోరు. పూర్తిగా చదువుకు దూరం కూడా ఐతరు. ఇప్పటికే కట్టి ఉన్న టాయ్లెట్ లు నీళ్ళు లేక, నల్లాలు లేక, కరెంటు కనెక్షన్ లేక ఘోరమైన స్థితిలో ఉన్నాయి అని తెల్సుకొని కొత్తగా కట్టించే బదులు, ఉన్నవాటిని వాడేటట్టు చెయ్యాలనే నా ఆలోచన నుండి పుట్టింది స్వచ్ఛ ట్రక్ ప్రాజెక్ట్ ఎన్నో సమస్యలను ఎదుర్కున్నం. పట్టుదలతో పరిశోధించినం. అన్నిటికంటే ముఖ్యమైనది, బాత్రూంలు కడిగేది ఎవరు? జీతం ఇచ్చినా మన దగ్గర ఆ పని చెయ్యడానికి ఎవ్వరూ ముందుకు రారు. దానికి కారణం ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’ అనే దానికి అర్థం తెల్వకపోవడం. అది అర్థం చేసుకునేటట్టు ప్రోత్సహించి, నేనే కొన్ని రోజులు వెళ్లి బాత్రూం లు కడిగిన’’ అని వివరించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

‘‘ముందుకు వచ్చిన యువతకు కేంద్ర మంత్రితో సన్మానం చేయించి, ఆ ఉద్యోగం వల్ల ఎంత మంది పిల్లలకు మంచి జరుగుతుంది అని అర్థమయ్యేలా చేశాం. అట్లా.. మొదలై ఇప్పుడు మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, శంకర్ పల్లి మండలాల్లో ఉన్న 100 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతీ రోజు మా 6 స్వఛ్చ ట్రక్ లు బాత్రూం లు శుభ్రం చేస్తున్నాయి. ఆ స్కూల్స్ లో చదువుకుంటున్న విద్యార్థినీ, విద్యార్థులు, ఆ స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ మాకు ఎంతో విలువైనది. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ స్కూల్స్ కి విస్తరించడానికి జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేం ప్రయత్నం చేస్తున్నం’’ తాను చేస్తున్న కార్యక్రమాలకు గురించి వివరించారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.