317 జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉందని, తక్షణమే 317 జీవో ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాల ప్రతినిధుల తో సంప్రదించకుండానే ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైనపద్దతి కాదన్న కోమటిరెడ్డి, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో రైతులు ఇప్పటికే బాధపడుతున్నారని తెలిపారు.
ఏకపక్ష నిర్ణయం ఉద్యోగ కుటుంబాలను కలవరపెడుతోందని, ఈ జీవో లో స్థానికతని పరిగణనలోకి తీసుకోలేదని కోమటిరెడ్డి తెలిపారు. జిల్లాల కేటాయింపులో సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చారని దీని వల్ల ఉన్నత అధికారులతో పైరవీ చేయించుకోగలిగేవారు తమకి నచ్చిన ప్రాంతాల్లో, పైరవీ చేయించుకోలేని వారు సీనియారిటీ ఉన్నా దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే ప్రమాదముందని కోమటిరెడ్డి తెలిపారు.
ఈ జీవో గిరిజనల ప్రయోజనాల ను కాపాడటంలో విఫలం అయ్యిందని, అయిదవ షెడ్యూల్ కింద రాజ్యాంగం లోని ఆదివాసీ ప్రాంతాలకు నిర్దిష్టమైన ప్రత్యేక నిబంధన ఉందని, అక్కడ తీసుకునే ఏ నిర్ణయానికైనా రాష్ట్రపతి ఆమోదం అవసరమని కోమటిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ తప్పడు నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ప్రజలు, రైతులు బాధలు పడుతున్నారని, ఇకనైనా స్పష్టత లేని జీవోని రద్దు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి నూతన మార్గదర్శలను విడుదల చేయాలని కోమటిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.