Site icon HashtagU Telugu

Virat Kohli: సెంచరీతో సమాధానమిచ్చిన కోహ్లీ.. విమర్శకులపై ఘాటుగా రియాక్షన్

Virat Kohli

Virat Kohli

విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో  ఓ సంచలనం. ‘‘ఇక కోహ్లీ పని అయ్యిపోందిలే’’ అంటూ విమర్శలకు దిగేవారికి బ్యాట్ తో సమాధానమిస్తాడు. అదీ కోహ్లీ నైజం కూడా. పడిలేచిన కెరటం లా పరుగులు సాధిస్తూ తాను ఎంత విలువైన ఆటగాడినోనని చాటి చెప్తుంటాడు. నిన్న సెంచరీతో కదం తోక్కిన విరాట్ కోహ్లి తన విమర్శకులపై విరుచుకుపడ్డాడు. బయటి వాళ్లు ఏమన్నా తాను పట్టించుకోనని, ఎలా గెలవాలో తనకు తెలుసని అతడు అనడం విశేషం. ఐపీఎల్లో నాలుగేళ్ల తర్వాత సెంచరీతో ఆర్సీబీని గెలిపించిన తర్వాత కోహ్లి చాలా ఘాటుగా స్పందించాడు.

ఈ సీజన్ ఐపీఎల్లో విరాట్ పరుగులు చేస్తున్నా.. స్ట్రైక్ రేట్ సరిగా లేదన్న విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అతడు టీ20 క్రికెట్ కు పనికి రాడని కూడా విమర్శించిన వాళ్లు ఉన్నారు. వాళ్లందరికీ కోహ్లి తన సెంచరీతో సమాధానమిచ్చాడు. తన మార్క్ పక్కా క్రికెట్ షాట్లతో కేవలం 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. దీంతో 8 వికెట్లతో గెలిచిన ఆర్సీబీ.. తన ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరచుకుంది.

అతని దూకుడు ముందు 187 పరుగుల లక్ష్యం కూడా చాలా చిన్నదైపోయింది. ఈ ఇన్నింగ్స్ తర్వాత కోహ్లికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తనపై వస్తున్న విమర్శలపై కోహ్లి ఘాటుగా స్పందించాడు. “ఏదో కొన్ని మంచి ఇన్నింగ్స్ ఆడాడులే అన్నట్లు ఐపీఎల్లో నన్ను ఓ సాధారణ ప్లేయర్ గా చూశారని నేను టీమ్ ప్లేయర్స్ తో చెబుతుండేవాడిని. కానీ నాకు ఐపీఎల్లో ఇది ఆరో సెంచరీ. నాకు నేను ఎప్పుడూ క్రెడిట్ ఇచ్చుకోను. గత రికార్డులను పట్టించుకోను. నేనిప్పటికే నన్ను నేను చాలా ఒత్తిడిలోకి నెట్టేసుకున్నాను. బయటి వాళ్లు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే అది వాళ్ల అభిప్రాయం. ఎలాంటి పరిస్థితుల్లో ఎలా గెలిపించాలో నాకు తెలుసు. ఇప్పటికే నేను చాలాసార్లు ఆ పని చేశాను అని కోహ్లీ ఘాటుగా సమధానమిచ్చాడు.

Also Read: Management Guru Lord Hanuman : హనుమాన్..ది గ్రేట్ మేనేజ్మెంట్ గురూ