LSG Victory: రాహుల్ ధనాధన్… లక్నో సూపర్‌ విక్టరీ

ఐపీఎల్ 15వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ మళ్ళీ పుంజుకుంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - April 16, 2022 / 08:21 PM IST

ఐపీఎల్ 15వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ మళ్ళీ పుంజుకుంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ సూపర్ సెంచరీతో రెచ్చిపోయిన వేళ ముంబై ఇండియన్స్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఎప్పటిలాగే బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్ వరుసగా ఆరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలవడం తప్పిస్తే ముంబైకి కలిసొచ్చింది ఏమీ లేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. రాహుల్, డికాక్ తొలి వికెట్‌కు 5.3 ఓవర్లలో 52 పరుగులు జోడించారు.

డికాక్ 24 రన్స్‌కు ఔటైనప్పటకీ… కేఎల్ రాహుల్ దూకుడు కొనసాగింది. కొన్ని మ్యాచ్‌లకు పెద్ద ఇన్నింగ్స్‌ ఆడలేదన్న కసితో మరింత రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో ముంబై బౌలర్లను ఆటాడుకున్నాడు. మనీశ్ పాండేతో కలిసి రెండో వికెట్‌కు 8 ఓవర్లలోనే 72 పరుగులు జోడించాడు. తర్వాత స్టోనిస్, దీపక్ హుడా త్వరగానే ఔటైనా… రాహుల్ జోరు మాత్రం తగ్గలేదు. ఐపీఎల్‌ కెరీర్‌లో వందో మ్యాచ్‌ ఆడుతున్న రాహుల్‌.. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. రాహుల్‌ సూపర్ సెంచరీతో లక్నో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌ ఎప్పటిలానే తడబడింది.

పేలవ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ రోహిత్‌శర్మ మరోసారి నిరాశపరిస్తే…అంచనాలు పెట్టుకున్న ఇషాన్ కిషన్ కూడా విఫలమయ్యాడు. అయితే బేబీ ఏబీడీగా పేరున్న బ్రెవిస్ , సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడడంతో స్కోర్ వేగం పుంజుకుంది. బ్రెవిస్ కేవలం 13 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 31 రన్స్ చేయగా.. సూర్యకుమార్ 37 పరుగులకు ఔటయయాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత తిలక్ వర్మ , పొల్లార్డ్ దూకుడుగా ఆడలేకపోయారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన లక్నో బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. గత రెండు మ్యాచ్‌ల తరహాలోనే చివరి వరకూ క్రీజులో ఉన్న పొలార్డ్ రెండు భారీ సిక్సర్లు కొట్టినా జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. చివర్లో టెయిలెండర్లు వరుస రనౌట్లవడంతో ఓటమి ఖాయమైంది.

25 రన్స్ చేసిన పొల్లార్డ్ 9వ వికెట్‌గా ఔటవడంతో ముంబైకి ఆరో ఓటమి తప్పలేదు. చివరికి ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసింది. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా… హోల్డర్, చమీరా, బిష్ణోయ్ , స్టోయినిస్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక టోర్నీలో ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవని ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికే పరిమితమైంది.