Site icon HashtagU Telugu

IPL 2022: సన్‌రైజర్స్‌కు మరో ఓటమి

Lsg

Lsg

ఐపీఎల్ 15వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన హైదరాబాద్ రెండో మ్యాచ్‌లో కాస్త మెరుగైనప్పటకీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.నిజానికి సన్‌రైజర్స్ ఈ మ్యాచ్ చేజేతులా ఓడిందనే చెప్పాలి. 3 ఓవర్లలో 33 పరుగులు చేయాల్సిన దశలో భారీ షాట్లు కొడుతున్న ఇద్దరు బ్యాటర్లు క్రీజులో ఉన్నవేళ మ్యాచ్‌లో ఓడిపోయింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరు అభిమానులను అలరించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ 169 పరుగులు చేసింది. లక్నో ఈ స్కోర్ చేసిందంటే కెప్టెన్ కేఎల్ రాహుల్, దీపక్ హుడాలే కారణం. కేవలం 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆ జట్టును వీరిద్దరే ఆదుకున్నారు. హాఫ్ సెంచరీలతో మంచి స్కోర్ అందించారు. రాహుల్ 50 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌తో 68 పరుగులు చేయగా… భారీ షాట్లతో అదరగొట్టిన దీపక్ హుడా కేవలం 33 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో ఆయూష్ బదోని 19 రన్స్ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 2 , షెపార్డ్ 2 , నటరాజన్ 2 వికెట్లు పడగొట్టారు.

170 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన హైదరాబాద్‌ త్వరగానే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. అభిషేక్ శర్మ 13, విలియమ్సన్ 16 పరుగులకే ఔటవగా… ఈ దశలో రాహుల్ త్రిపాఠీ మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మక్రరమ్‌ ఔటైనా… త్రిపాఠీ , నికోలస్ పూరన్ జోరుతో సన్‌రైజర్స్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. త్రిపాఠీ 30 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 44 రన్స్‌కు ఔటయ్యాక.. పూరన్ భారీ షాట్లు ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. చివరి 3 ఓవర్లలో 33 పరుగులు చేయాల్సి ఉండగా…అవేశ్‌ ఖాన్ ఒకే ఓవర్లలో పూరన్‌తో పాటు అబ్దుల్ సమద్‌ను పెవిలియన్‌కు పంపాడు. దీంతో మ్యాచ్ లక్నో వైపు మొగ్గింది. తర్వాత బ్యాటర్లు పోరాడినా లక్నో బౌలర్ హోల్డర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. చివరి ఓవర్లో విజయం కోసం 16 పరుగులు చేయాల్సి ఉండగా.. హోల్డర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికట్లు పడగొట్టాడు. హోల్డర్ 3 , అవేశ్ ఖాన్ 4 , కృనాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. తాజా ఫలితం తర్వాత పాయింట్ల పట్టికలో హైదరాబాద్ చిట్టచివరి స్థానంలో నిలిచింది. మరోవైపు ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు సాధించిన లక్నో పాయింట్ల పట్టికవో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

Photo Courtesy- LSG/Twitter