పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై సైనిక దాడి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలపై ఈరోజు సాయంత్రం కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శాంతి భద్రతలపై ముందస్తుగా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డిప్యూటీ సీఎం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సచివాలయంలో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.
ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డిజిపి జితేందర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సీఎమ్ఓ జయేష్ రంజన్, హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్, సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ కమిషనర్ సుధీర్ బాబులతో డిప్యూటీ సీఎం సమావేశం నిర్వహించనున్నారు.