కేరళ ప్రభుత్వం ప్రధాన ఐటీ పార్కుల ప్రాంగణంలో బార్ అండ్ రెస్టారెంట్ కలిగి ఉండేందుకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో కేరళ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో పాలసీని సిద్ధం చేస్తున్న ప్రభుత్వం క్రియాశీల పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలలో ఇది ఒకటిగా ఉన్నట్లు సమాచారం. ఈ సదుపాయం ఇతర రాష్ట్రాల యువకులకు రాష్ట్రాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని ఐటీ రంగంలోని వాటాదారుల సిఫార్సు ఆధారంగా ఈ ప్రతిపాదన రూపొందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బయట చాలా నగరాల్లో టెక్కీలు ఎక్కువ వినోద సౌకర్యాలను కలిగి ఉన్నారు. అలానే కేరళలో కూడా వినోద సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తుంది.
ఐటీ పార్కుల ప్రాంగణంలో నిర్ణీత స్థలంలో అలాంటి సౌకర్యాన్ని కల్పించాలనే ఆలోచన ఉందని.. ఎంపిక ప్రక్రియ ద్వారా సదుపాయాన్ని అమలు చేయడానికి అనుభవజ్ఞుడైన హోటల్ వ్యాపారిని ఐటీ పార్కులు ఎంచుకోవచ్చిని అధికార వర్గాలు అంటున్నాయి. దీనికి సంబంధించి ముసాయిదా తయారు చేసి..వాటాదారులతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మార్చి నెలాఖరులోగా ఈ విధానాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అధికారుల నుంచి వస్తున్న సమాచారం. పార్క్ అథారిటీ ద్వారా నిర్వహించబడే పార్కులో ఒక రెస్టారెంట్‌ను అనుమతించాలనేది ఇప్పుడు ఆలోచనగా ఉంది. ఇతర ప్రతిపాదనలలో బేవరేజెస్ కార్పొరేషన్ కోసం మరిన్ని అవుట్‌లెట్‌లను అనుమతించడం, ప్రైవేట్ రంగంలో పండ్ల వైన్ తయారీ, మద్యం దుకాణాలు, విద్యా లేదా మతపరమైన సంస్థల మధ్య దూర పరిమితిని మరింత తగ్గించడం వంటివి ఈ పాలసీలో ఉన్నాయి.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో తొలి వాణిజ్య వైన్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బేవరేజెస్ కార్పొరేషన్ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆలిండియా వైన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌తో బుధవారం రెండో విడత చర్చలు జరిపింది. పాలక్కాడ్ లేదా కన్నూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంట్‌కు అసోసియేషన్ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ ప్లాంట్ ఏడాదిలో లక్ష లీటర్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 18 నెలల్లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అరటి, పైనాపిల్, జీడి యాపిల్ మరియు జాజికాయ పండ్ల నుండి ఉత్పత్తి ప్రారంభించాలనేది ప్రస్తుతం ప్రతిపాదన ఉంది.