సహ జీవనంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం(Live In Relationship) సాగించే జంటను పెళ్లి చేసుకున్నట్టుగా చట్టం గుర్తించదని స్పష్టం చేసింది. వ్యక్తిగత, లౌకిక చట్టాల ప్రకారం జరిగే వివాహాలకు మాత్రమే చట్టపరమైన గుర్తింపు ఉంటుందని న్యాయమూర్తులు ఎ.మహ్మద్ ముస్తాక్, సోఫీ థామస్ లతో కూడిన బెంచ్ తీర్పు ఇచ్చింది. ఒప్పందం ప్రకారం కలిసి జీవించే జంటకు దాన్ని పెళ్లిగా క్లెయిమ్ చేసుకునే హక్కు ఉండదని, దాని ఆధారంగా విడాకులు కోరే హక్కు కూడా వారికి లేదని తేల్చి చెప్పింది. హిందువు, క్రిస్టియన్ జంట రిజిస్టర్డ్ అగ్రిమెంట్ చేసుకొని 2006 నుంచి సహజీవనం చేస్తున్నారు. వారికి 16 ఏళ్ల పాప కూడా ఉంది.
Also read : Divorce With Wife: భార్యతో విడాకులు.. ఆనందంలో యువకుడి బంగీ జంప్.. చివరికి ప్రాణాలే..
తమ బంధాన్ని కొనసాగించడం ఇష్టంలేని ఈ జంట విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. కానీ పెళ్లి చేసుకోనందున వారికి విడాకులు మంజూరు చేయడం సాధ్యం కాదంటూ పిటిషన్ ను ఫ్యామిలీ కోర్టు కొట్టివేసింది. దీనిపై ఆ జంట కేరళ హైకోర్టులో అప్పీల్ చేయగా.. లివ్-ఇన్ రిలేషన్ షిప్ ను(Live In Relationship) వివాహంగా గుర్తించలేమని పేర్కొంది. లివ్-ఇన్ రిలేషన్ షిప్ అంటే పెళ్లి కాదు, అందులో విడాకులు కోరకూడదని న్యాయమూర్తులు కామెంట్ చేశారు.