Kenya starvation: మూడనమ్మకాలతో ప్రజలు తమ ప్రాణాలని సైతం లెక్కచేయట్లేదు. ఇలా చేస్తే మరో జన్మ ఉంటుందని, అలా చేస్తే స్వర్గానికి వెళతారని కొందరు మత పెద్దలు బోధిస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు నమ్మి మోసపోతున్నారు. కొందరు ఆ విషయాలను సీరియస్ గా తీసుకుని ప్రాణాలను లెక్కచేయడం లేదు. కెన్యాలో తాజాగా జరిగిన ఘటన ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది.
దక్షిణ కెన్యాలోని షకహోలా అటవీ ప్రాంతంలో వందలకొద్దీ శవాలు వెలుగుచూస్తున్నాయి. అటవీ ప్రాంతంలో శవాలు బయటపడటంతో దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, హంతకుడి కోసం విచారణ చేపట్టారు పోలీసులు. కానీ ఈ సమయంలో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. ఉపవాసం ఉంటే ఏసుకీస్తు వద్దకు వెళతారని, ఓ చర్చ్ ఫాదర్ చెప్పడంతో భక్తులు ఆ మాటలను విశ్వసించి రోజులకు రోజులు ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉన్నారు. చివరకు శరీరం తట్టుకోక కన్నుమూశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 200కు పైగా మృతి చెందారు.
కెన్యాలోని షాకహోలా అడవుల్లో సమాధుల నుంచి బయటపడిన మృతదేహాల సంఖ్య 201కి చేరుకుంది. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ అదృశ్యమయ్యారని భయపడుతున్నారు. శనివారం సమాధుల నుండి 22 మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను పోలీసులు సేకరించారు. తద్వారా ఈ వ్యక్తులు ఆకలితో చనిపోయారని తేలింది. కాగా.. ఈ కేసులో ఇంటర్నేషనల్ చర్చికి చెందిన పాస్టర్ పాల్ మెకెంజీకి బెయిల్ మంజూరు చేసేందుకు కెన్యా కోర్టు నిరాకరించింది.