ఢిల్లీ ఎన్నికల్లో ఆన్ఆద్మీ (AAP) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజీవాల్ (Arvind Kejriwal) తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలుగా భావించవచ్చు. అలాగే ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సైతం ఓడిపోయారు.
జంగ్పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు బీజేపీ 4 చోట్ల విజయం సాధించగా AAP ఒకచోట గెలుపొందింది. ఈ ఎన్నికలతో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ తిరిగి అధికారంలోకి రాబోతుండడం బిజెపి శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.