Viral Pic: కేదార్‌నాథ్‌.. మహాఅద్భుతం!

  • Written By:
  • Updated On - January 7, 2022 / 11:42 AM IST

కొన్ని ఆలయాలు ఆధ్యాత్మికతో పాటు మంచి ఆహ్లాదాన్నిస్తాయి. ఒకసారి సందర్శిస్తే.. మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటుంది. అలాంటి అలయాల్లో కేదార్ నాథ్ ఆలయం ఒకటి. ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా మంచు ప్రభావం కనిపిస్తోంది. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ ఆలయం వద్ద దట్టమైన మంచు కురుస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ఈ ఫొటోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. దట్టమైన మంచులో ఆలయ రూపం చూడముచ్చటగా ఉందని చెబుతూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆలయ చరిత్ర

పురాణాల ప్రకారం కేదార్‌నాథ్ ఆలయ కథ పాండవులతో ముడిపడి ఉంది. ద్వాపర్ యుగంలో పాండవులు మహాభారత యుద్ధంలో విజయం సాధించినప్పుడు వారు తమ సోదరులు, బంధువుల వధతో మిక్కిలి దుఃఖాన్ని అనుభవించారు. ఆ పాపం నుండి విముక్తి పొందడానికి పాండవులు శివుడిని చూడటానికి కాశీకి చేరుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పరమేశ్వరుడు కోపంతో కేదార్ నాథ్ కు చేరుకున్నాడు. శివుడు వెంటే పాండవులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఇక వారికి కనిపించకుండా ఉండడం కోసం శివుడు గోవు రూపాన్ని ధరించి మందలో చేరిపోయాడు. అయితే ఈ విషయాన్ని గ్రహించిన భీముడు ఆకస్మాత్తుగా తన ఎత్తును పెంచి భారీగా పెరిగిపోయాడు. దీంతో ఆ గోవులన్నీ భీముడి కాళ్ళ సందులో నుంచి వెళ్ళిపోయాయి. కానీ శివుడు మాత్రం వెళ్లకుండా అలానే నిల్చుండిపోయారు. ఇది గమనించిన భీముడి శివుడికి నమస్కరించి వేడుకున్నాడు. దీంతో శివుడు వారికి దర్శనమిచ్చాడు. ఇక పాపాన్ని వదిలించుకున్న పాండవులు కేదార్ నాథ్ లో శివుడి ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయంలో శివుడివి గోవు ఆకారంలో పూజిస్తారు.