KCR Bhadrachalam Tour : పొలిటిక‌ల్ హీట్ పెంచిన కేసీఆర్ భ‌ద్రాచ‌లం టూర్‌..!

వరద ప్రభావిత జిల్లాల్లో ఆదివారం సీఎం కేసీఆర్‌ రోజంతా పర్యటించడం తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పెంచింది.

  • Written By:
  • Updated On - July 18, 2022 / 02:14 PM IST

హైదరాబాద్: వరద ప్రభావిత జిల్లాల్లో ఆదివారం సీఎం కేసీఆర్‌ రోజంతా పర్యటించడం తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పెంచింది. ఉమ్మ‌డి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వరద బాధిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్‌ ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆదివారం ఉదయం అకస్మాత్తుగా ప్లాన్ మార్చుకుని రోడ్డు మార్గంలో సీఎం కేసీఆర్ భద్రాచలం వెళ్లారు. భద్రాచలం వరద ప్రభావిత ప్రాంతాలను రోడ్డు మార్గంలో సందర్శించిన అనంతరం హెలికాప్టర్‌లో ఏటూరునాగారం చేరుకుని ఏరియల్ సర్వే నిర్వహించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా రోడ్డు మార్గంలో ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించి, రెండు జిల్లాల్లోని బాధితులతో మమేకమై భద్రాచలంలో గోదావరి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. తొలుత రైలులో మణుగూరు చేరుకున్న గవర్నర్ అనంతరం రోడ్డు మార్గంలో రెండు జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు.

రోడ్డు మార్గంలో భద్రాచలాన్ని సందర్శించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. వాతావ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో పైలట్ల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో అధికారులు నుంచి వ‌చ్చిన స‌మాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదయం 7.20 గంటలకు హన్మకొండ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11 గంటలకు భద్రాచలం చేరుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి హెలికాప్టర్‌లో ఏటూరునాగారం బయల్దేరి వెళ్లారు. ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి వరద బాధిత ప్రాంతాలను సందర్శించి సాయంత్రం 6.25 గంటల వరకు బాధితులతో మమేకమై రోడ్డు మార్గంలో హన్మకొండకు పయనమయ్యారు. ముఖ్యమంత్రి హన్మకొండలోని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు నివాసంలో రాత్రి బస చేసి సోమవారం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. ఆదివారం కూడా లక్ష్మీకాంతరావు నివాసంలోనే రాత్రి బస చేశారు.