KCR Delhi Politics: ఢిల్లీపై ‘తెలంగాణ’ ఆత్మగౌరవం!

ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ ఎజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - May 20, 2022 / 10:18 PM IST

ప్రస్తుత రాజకీయ పరిణామాల వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ ఎజెండా ఎత్తుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సుదీర్ఘ పర్యటనకు శ్రీకారం చుట్టారు. నేటి నుంచి పదిరోజులపాటు ఆయన జాతీయ నేతలతో మంతనాలు జరపనున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించనున్నారు. ఇప్పటికే బీజేపీపై సమర శంఖం పూరించిన సీఎం కేసీఆర్..మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.

ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయిన కేసీఆర్ మోడీ పై ఒత్తిడి పెంచేందుకు ఢిల్లీ పయనమయ్యారు. ఈ నేపథ్యంలో శుక్ర‌వారం హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరిన తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో ఢిల్లీ చేరుకున్నారు. శుక్ర‌వారం రాత్రి ఢిల్లీలోనే బ‌స చేయ‌నున్న కేసీఆర్‌… శ‌నివారం రాజ‌కీయ‌, ఆర్థిక రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌తో భేటీ కానున్నారు. ఆ త‌ర్వాత జాతీయ మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తోనూ కేసీఆర్ భేటీ కానున్నారు.

ఢిల్లీ కేంద్రంగా రాజకీయ పావులు కదుపుతున్న కేసీఆర్ తన ప్రభావం చూపేందుకు టీఆర్ఎస్ భవన్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ నడి బొడ్డున తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీకగా నిలిచే టిఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి’’ అని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కేసిఆర్  ఆదేశానుసారం పార్టీ భవన్ నిర్మాణ పనులు మంత్రి మొదటి నుంచే దగ్గరుండి పర్యేక్షిస్తున్నారు. నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల పర్మిషన్స్ తీసుకున్నారు. MDP ఇన్ఫ్రా నిర్మాణ సంస్థ భవన్ నిర్మాణ పనుల బాధ్యతలు అప్పగించారు. ఇవాళ లాంఛనంగా భవన్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. కేసిఆర్  విధించిన నిర్ణీత గడువులోగా టిఆర్ఎస్ భవన్ నిర్మాణం పూర్తవుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ భవన్ నిర్మాణంతో ఢిల్లీని రాజకీయ అడ్డగా మార్చుకునేందుకు సీఎం కేసీఆర్ కు దోహదపడుతుంది.