Site icon HashtagU Telugu

KCR : కేసీఆర్‌ది మళ్లీ అదే వ్యూహం.. బెడిసికొడుతుందా.. కలిసివస్తుందా..?

Kcr Brs

Kcr Brs

తెలంగాణ స్వరాష్ట్రంలో రెండు పర్యాయాలు అధికారం చేజిక్కించుకున్న బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS) గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాలోకి వెళ్లిపోయింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోతామని తెలిసిపోతామని ముందే తెలుసునని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలింగ్‌కు 15 రోజుల ముందే బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోతుందని తెలిసినా.. అప్పుడు అభ్యర్థులను మార్చడం వీలుకాదని అలాగే ఉండిపోయామన్నారు. అయితే.. ఇదిలా ఉంటే.. ఇప్పుడు రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress)‌, బీఆర్‌ఎస్‌ తో పాటు బీజేపీ (BJP) పార్టీలు సిద్ధమవుతున్నాయి. బీజేపీ అధిష్టానం 195 స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్‌ సైతం గెలుపు గుర్రాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తోంది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే.. తాజాగా బీఆర్‌ఎస్‌ తొలి పార్లమెంట్‌ ఎన్నికల్లో (Parliament Elections) బరిలోకి దించే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిచింది. కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. అనుకున్నట్టుగానే కరీంనగర్ టికెట్ బి.వినోద్ కుమార్ (B.Vinod Kumar)కు దక్కింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్‌పై ఆయన పోటీ చేయనున్నారు. ఇప్పటికే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత (Venkatesh Netha) గత నెలలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గం టికెట్‌ ధర్మపురి మాజీ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ (Koppula Eshwar)కు దక్కింది. సీనియర్‌ నేత నామా నాగేశ్వర్‌రావు (Nama Nageshwara Rao)కు ఖమ్మం, మాలోత్‌ కవిత (Malot Kavitha) మహబూబాబాద్‌ టిక్కెట్‌ దక్కించుకున్నారు. వీరిద్దరూ ఆయా నియోజకవర్గాల నుంచి సిట్టింగ్ ఎంపీలు. ప్రకటించిన నలుగురిలో ముగ్గురు అభ్యర్థులు 2019 ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఇలా పాత అభ్యర్థులకే టిక్కెట్లు ఇచ్చే సంప్రదాయాన్ని మరోసారి బీఆర్‌ఎస్‌ పునరావృతం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే వ్యూహం బెడిసికొట్టింది. మరి ఈసారి కేసీఆర్ తన వ్యూహాలు ఫలిస్తాడో లేదో చూడాలి.