Assembly : బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీ వద్దకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సాదరస్వాగతం పలికారు. బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన అసెంబ్లీలోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలోకి వెళ్లారు. అనంతరం వారితో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
Read Also: God Is Real : దేవుడు ఉన్నాడు.. గణిత ఫార్ములాతో నిరూపిస్తా.. శాస్త్రవేత్త విల్లీ సూన్
ఇంతవరకు సమావేశాలలో కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ బండిని నడిపించారు. ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో గులాబీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. నేడు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ సభకు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, పెండింగ్ హామీల అమలు తీరుపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా రాష్ట్రంలో పింఛన్ ఇంకా పెంచకపోవడం, విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విదుదలలో జాప్యంపై నిలదీయనున్నారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన దళితబంధు పథకం నిలిపివేయడంతో పాటు కూలీలకు రూ.15 వేలు అని హామీ ఇచ్చి 12 వేలకు కుదించడం, పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడం లాంటి వాటిపై అసెంబ్లీ సాక్షిగా గట్టిగా నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రజా సమస్యల మీద ఉభయసభల్లో ప్రతిభావంతంగా పోరాడేందుకు, సభ్యులను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకునేందుకు వీలుగా డిప్యూటీ లీడర్లను నియమించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సమావేశంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.