Bomb on Plane: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్-చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకుడు డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో సీఐఎస్‌ఎఫ్, శంషాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. విమానాశ్రయానికి ఆయన లేట్‌గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
దిల్లీ నుంచి ఒడిశా వెళ్తున్న విమానానికి ఇదే రకమైన ఘటన చోటుచేసుకుంది. దిల్లీ నుంచి ఒడిశాలోని దేవ్‌గఢ్‌కు వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ ఆగంతకులు ఫోన్ చేసి చెప్పారు. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో అప్రమత్తమైన అధికారులు విమానానాన్ని లఖ్నవూకి మళ్లించారు. పూర్తి స్థాయిలో పరిశీలిం చిన తర్వాత ఒడిశా వెళ్లేందుకు అనుమతించారు. అయితే ఎవరు కాల్ చేశారనే దానిపై విమానయాన అధికారులు దర్యాప్తు చేపట్టారు.