Hijab Issue: కర్ణాటకలో హిజాబ్ వివాదం.. ఇప్పుడు ఆ స్కూల్స్, కాలేజీలకూ వర్తింపు

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

  • Written By:
  • Updated On - February 18, 2022 / 08:09 AM IST

కర్ణాటకలో హిజాబ్ వివాదం ఇంకా చల్లారలేదు. మైనారిటీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న విద్యాసంస్థల్లో కూడా విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం నిషేధం విధించడంతో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు మాత్రం హైకోర్టు నిర్ణయం మేరకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కర్ణాటక హైకోర్టు… తాము తదుపరి ఆదేశాలను ఇచ్చేవరకు.. రాష్ట్రంలోని స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులంతా మతపరమైన దుస్తులు ధరించకూడదంటూ స్పష్టంగా చెప్పింది.

ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో ఇతర విద్యాసంస్థకు వర్తింపజేస్తోంది. మైనార్టీ శాఖ పరిధిలో ఉన్న మౌలానా ఆజాద్ మోడల్ స్కూల్స్ తోపాటు ఆ కాలేజీలకూ ఇవే ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది. వీటిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తోంది. శివమొగ్గ జిల్లాలో హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడంతో ఇప్పటికే తొమ్మిది మందిపై కేసు నమోదు చేసింది.

కన్నడ నేలపై ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో రాష్ట్రంలో వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థులు రెండు వర్గాలు చీలిపోయారు. ఎవరికివారు తమ మతపరమైన దుస్తులతో రావడంతో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఖరికి కొద్ది రోజులపాటు విద్యాసంస్థలను మూసేయాల్సి వచ్చింది. నిరసనకారులపై లాఠీఛార్జీ చేసేంతవరకు పరిస్థితి వెళ్లింది.

హిజాబ్ వివాదంపై రాష్ట్రంలోని సెలబ్రెటీలతోపాటు జాతీయస్థాయిలో రాజకీయనాయకులు కూడా స్పందించడంతో ఈ వివాదం పెద్దదైంది. చివరకు విద్యార్థులు హైకోర్టు తలుపును తట్టడం, ఆపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. మొత్తానికి హైకోర్టు ఆదేశాలతో పరిస్థితులు దారికొచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించడంతో కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.