Hijab Issue: కర్నాటకలో హిజాబ్ వివాదం.. సీఎం బొమ్మై కీలక నిర్ణయం

కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ సీఎం బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Hijab

Hijab

కర్ణాటకలో హిజాబ్ వివాదం ముదురుతున్న వేళ సీఎం బసవరాజు బొమ్మై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూడు రోజుల పాటు మూసివేయాలని ఆదేశించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలతో పాటు కర్ణాటక ప్రజలు శాంతి, సామరస్యాన్ని కాపాడాలని సీఎం బొమ్మై విజ్ఞప్తి చేశారు. వచ్చే మూడు రోజుల పాటు అన్ని ఉన్నత పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించినట్లు తెలిపారు. పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు హిజాబ్‌ను ఎత్తుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆరోపించడాన్ని సీఎం బొమ్మై ఖండించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు సరైన విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్‌కోడ్‌పై చట్టానికి కట్టుబడి ఉందని, అదే స్టాండ్‌ను కోర్టు ముందు ఉంచిందని అన్నారు. ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పు వెలువరించే వరకు రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సాహసం ఎవరూ చేయకూడదని, చివరకు కోర్టు తీర్పును గౌరవిస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ అన్నారు. మూతపడే రోజులతో సంబంధం లేకుండా పరీక్షలు జరుగుతాయని, ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు, డిప్లొమా, ఇంజినీరింగ్ కళాశాలలకు ఈ మూసివేత వర్తిస్తుందని తెలిపారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని సమీక్షించేందుకు కర్ణాటక హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర మంగళవారం సాయంత్రం తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. హిజాబ్ ఆంక్షలను సవాల్ చేస్తూ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీకి చెందిన ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్లపై కర్ణాటక హైకోర్టు విచారణ జరుపుతోంది.

  Last Updated: 09 Feb 2022, 10:00 AM IST