Acid Attack: యువతి పై యాసిడ్ దాడి కేసు : పరారీలో దుండగుడు.. పట్టుకునేందుకు 7 టీమ్ లు

ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటనను కర్ణాటక పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - May 2, 2022 / 02:46 PM IST

ఓ యువతిపై యాసిడ్ దాడి ఘటనను కర్ణాటక పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఏప్రిల్ నెలాఖరులో ఈ ఘటన చోటుచేసుకున్నప్పటి నుంచి దుండగుడు నగేష్ పరారీలో ఉన్నాడు. తన ప్రేమ ప్రతిపాదనను నిరాకరించిందనే కోపంతో ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. అతడిని పట్టుకునేందుకు అప్పట్లోనే 3 పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేయగా.. అనంతరం వాటిని ఐదుకు పెంచారు. తాజాగా సోమవారం పోలీసు టీమ్ ల సంఖ్యను 7 కు పెంచారు. నిందితుడిని వెతికేందుకు కొన్ని టీమ్ లు ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా వెళ్లాయి. దుండగుడు నగేష్ అన్నను , తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగేష్ పరిచయస్తులు మరో 20 మందిని కూడా కస్టడీలోకి తీసుకున్నారు.

యువతికి స్కిన్ ట్రాన్స్ ప్లాంటేషన్..

యాసిడ్ పడటంతో ఆ యువతి ముఖంపై చర్మానికి తీవ్ర నష్టం జరిగింది. దీంతో ముఖంపై చర్మ మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధం అవుతున్నారు. ఈచికిత్స చేశాక.. మరో రెండు, మూడు వారాల్లోగా చర్మం పెరుగుదల మొదలవుతుందని డాక్టర్లు తెలిపారు. ఒక దాత నుంచి సేకరించి..బెంగళూరు లోని విక్టోరియా హాస్పిటల్ లో భద్రపర్చిన చర్మాన్ని ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం వాడుతామని చెప్పారు.
ఆ యువతిని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్ పరామర్శించారు. ఈచికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును భరిస్తామని వెల్లడించారు. కోలుకున్న తర్వాత ఆమెకు తగిన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ఆయన పేర్కొన్నారు.