Murder Case: సంచలనం సృష్టించిన ఆరుగురు సభ్యుల కుటుంబ హత్య కేసులో, పోలీసులు రెండు మృతదేహాలను గుర్తించారు. మాక్లూర్ మండలం మదనపల్లి అటవీ ప్రాంతంలో, బాసర సమీపంలో గోదావరి నదిపై వంతెన వద్ద పూణె ప్రసాద్, అతని భార్య రమణి అలియాస్ సాన్వి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యమయ్యాయి. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. ఇప్పటికే కవల పిల్లల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఈ కేసులో ప్రశాంత్ యాదవ్‌తో పాటు అతని తల్లి వడ్డమ్మతో పాటు మరో ముగ్గురిని కామారెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. హత్యా దృశ్యాన్ని పునర్నిర్మించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రసాద్ కవల పిల్లలు, ఇద్దరు సోదరీమణులను కూడా నిందితులు 15 రోజుల వ్యవధిలో హత్య చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరు వరుస హత్యల కేసులో కామారెడ్డి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఆస్తి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు తేల్చారు. ఆర్థిక లావాదేవీలపై తలెత్తిన వివాదాలతో పాటు ప్రసాద్ ఆస్తిపై కన్నేసిన ప్రశాంత్ ఈ దారుణాలకు ఒడిగట్టినటు పోలీసులు తెలిపారు.