Kamal Haasan: డీఎంకే కూటమి వైపు కమల్‌హాసన్‌ చూపు

ద్రవిడ రాజకీయాల్లో మరో కొత్త పొత్తు పొడవబోతోందా..? డీఎంకే కాంగ్రెస్ కూటమికి కమల్‌హాసన్‌ జైకొట్టబోతున్నారా..? అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - February 28, 2023 / 11:17 PM IST

Kamal Haasan: ద్రవిడ రాజకీయాల్లో మరో కొత్త పొత్తు పొడవబోతోందా..? డీఎంకే కాంగ్రెస్ కూటమికి కమల్‌హాసన్‌ జైకొట్టబోతున్నారా..?
అంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. వరుస పరిణామాలు చూస్తుంటే.. డీఎంకే ప్లస్‌లో కమల్‌ చేరిక ఖాయమనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
తమిళనాట రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కొత్త పొత్తులు తెరమీదకి వస్తున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో NTK, AMMKలతో కలిసి పోటీచేసిన ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్‌.. క్రమంగా డీఎంకే కూటమికి దగ్గరవుతున్నారు.
మార్చి 1 స్టాలిన్ జన్మదినం సందర్భంగా చెన్నైలో ఏర్పాటుచేసిన ఫొటో గ్యాలరీని ప్రారంభించారు కమల్‌హాసన్‌. డీఎంకే ఎంపీ దయానిధి మారన్‌, మంత్రి పీకే శేఖర్ బాబు తదితరులు ఆయనతో ఉన్నారు. దీంతో మీడియా మొత్తం డీఎంకే MNM అలయెన్స్‌ గురించి ప్రశ్నలు సంధించింది. దీనికి ఆసక్తికర సమాధానం ఇచ్చారు ఉళగనాయగన్. ఇప్పడే ఏమీ చెప్పలేం అంటూనే.. పరోక్షంగా పొత్తు సంకేతాలు ఇచ్చారు. డీఎంకే పార్టీ భావజాలం తమ పార్టీ భావజాలానికి దగ్గరగా ఉంటుందన్నారు. స్టాలిన్‌ తనకు మంచి స్నేహితుడని.. ఆయనతో బంధం రాజకీయాలకు అతీతమని చెప్పుకొచ్చారు MNM అధినేత. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయినా.. తమిళనాడులో 2.52శాతం ఓట్లు రాబట్టగలిగింది కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యం. ఇప్పటివరకు ఏ పెద్ద పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. అయితే ఇటీవల ఈరోడ్ తూర్పు నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి మద్దతిచ్చారు కమల్‌హాసన్‌. ప్రచారం కూడా చేశారు. అంతకముందు ఢిల్లీ వెళ్లి భారత్‌ జోడో యాత్రలో పాల్గొనడమే కాకుండా.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు కమల్ హాసన్‌.
దీంతో డీఎంకే-కాంగ్రెస్‌ కూటమికి కమల్‌హాసన్‌ చేరువ అవుతున్నారనే చర్చ అప్పట్లోనే జోరుగా జరిగింది. ఇప్పుడే ప్రకటన లేకున్నా.. సార్వత్రిక ఎన్నికలు సమీపించే నాటికి మక్కల్ నీది మయ్యం డీఎంకే కూటమిలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.