Site icon HashtagU Telugu

Kaleshwaram Project : కాళేశ్వరానికి భారీగా వ‌ర‌ద నీరు.. లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు తెరిచిన అధికారులు

kaleswaram

kaleswaram

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోని బ్యారేజీలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీలోకి 22,15,760 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. దీంతో లక్ష్మీ బ్యారేజీ మొత్తం 85 గేట్లను తెరిచి వరద నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం సరస్వతీ బ్యారేజీకి 14,77,975 క్యూసెక్కుల నీరు వస్తుండగా, అధికారులు అంతే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ప్రవహిస్తున్నాయి. త్రివేణి సంగమం వద్ద నది 15.90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. దీంతో మహదేవపూర్, కాళేశ్వరం గోదావరి పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. పుష్కరఘాట్‌లను ముంచెత్తిన వరద నీరు సమీపంలోని ఇళ్లలోకి చేరింది. ముంపు ప్రాంతాల్లోని నివాసితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాళేశ్వరం ఘాట్‌ వద్దకు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60.30 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం నదిలో 18.16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం పట్టణాన్ని వరద నీరు చుట్టుముట్టింది. పట్టణంలోని కొత్త కాలనీ, సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ, అయ్యప్ప కాలనీ, రామాలయం ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది.

Exit mobile version