Site icon HashtagU Telugu

Kakinada Tiger Scare: పులి బోనులో ఏపీ!

Tiger

Tiger

ఏ బిడ్డా.. ఇది నా అడ్డా అన్నట్టుగా ఉంది బెంగాల్ టైగర్ పరిస్థితి. ఊరు నాదే.. అడవి నాదే అంటూ కనిపించినా జంతువుపై, మనిషిపై దాడి చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోంది. అటు ప్రజలను, ఇటు అటవీ అధికారులకు సవాల్ విసురుతూ ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. పులి ఎప్పుడు చిక్కుతుందా అని మొత్తం ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నెల 23 నుంచి గొల్లప్రోలు, శంకవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు మహారాష్ట్రలోని తడోబా అటవీ ప్రాంతం నుంచి ప్రత్యేక బృందం త్వరలో జిల్లాకు రానున్నట్లు కాకినాడ జిల్లా అటవీ అధికారి ఐకేవీ రాజు తెలిపారు.

పులి ఇప్పటి వరకు తొమ్మిది గేదెలు, ఒక ఆవు, దూడను చంపడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందం ట్రాంక్విలైజర్లను ఉపయోగిస్తుందని రాజు తెలిపారు. ఈ బెంగాల్ టైగర్ ను పట్టుకునేందుకు దాదాపు 150 మంది అటవీ అధికారులు, పులుల సంరక్షణకు చెందిన రెండు బృందాలు రంగంలోకి దిగాయి. దాని కదలికలను పర్యవేక్షించడానికి, ట్రాప్ చేయడానికి అధికారులు 52 సిసిటివిలు బోనులను కూడా ఏర్పాటు చేశారు. అటవీశాఖ అధికారులు జాతీయ పులుల సంరక్షణ అధికారులకు లేఖ కూడా రాశారు. ఒకట్రెండు రోజుల్లో తాడోబా బృందం ప్రత్తిపాడు మండలానికి చేరుకునే అవకాశం ఉందని డీఎఫ్‌వో తెలిపారు.

బెంగాల్ టైగర్ జనసంచారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా అటవీ అధికారులు నేటి వరకు పట్టుకోకపోవడంతో క్షణ క్షణం భయం భయంగా ఉంది. ఇక రాత్రి పడితే చాలు.. ప్రజలు ఇళ్లను విడిచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే గుంపులుగుంపులుగా తిరుగుతూ తమ పనులు చేసుకుంటున్నారు. ఇక పిల్లలు, పెద్దలు మాత్రం సాయంత్రం ఆరు దాటితే బిక్కుబిక్కుమంటూ ఇంట్లో గడుపుతున్నారు. ఇంటి ముందు మంటలు పెడుతూ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదిగో పులి, ఇదిగో పులి అంటూ ఏపీ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.