India: మాతృమూర్తిని, మాతృభాషను గౌరవించండి- ఎన్‌వీ రమణ

  • Written By:
  • Updated On - December 24, 2021 / 11:13 PM IST

గురువారం హైదరాబాద్ లోని ఓ కార్యక్రమంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వీ రమణ మాట్లాడుతూ.. తెలుగోడి గొప్పదనాన్ని తెలుగువారే ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధికి మనదేశంలో తయారైన కొవాగ్జిన్‌ టీకా అద్భుతంగా పనిచేస్తుందని, కొత్త వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఓవైపు బహుళ జాతి కంపెనీలు భారతదేశంలో తయారైన వ్యాక్సిన్‌ మార్కెట్లోకి రాకుండా ప్రయత్నిస్తుంటే, మరోవైపు మనవాళ్లు కూడా వెనక్కి లాగడానికి ప్రయత్నించారన్నారు. తెలుగువాళ్లలో ఐక్యత అవసరమని, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని సూచించారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్‌లో గురువారం జరిగిన డాక్టర్‌ రామినేని ఫౌండేషన్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో జస్టిస్‌ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మాతృమూర్తిని, మాతృభాషను, దేశాన్ని గౌరవించడం సంప్రదాయమన్నారు. బాధ్యతగల వ్యక్తులు సమాజం కోసం పనిచేయాల్సి ఉందంటూ గురజాడ చెప్పిన ‘దేశమంటే మనుషులోయ్‌’ అన్న గేయాన్ని వినిపించారు. తెలుగు భాషను పిల్లలకు నేర్పాలని, కనీసం ఇంట్లో అయినా మాట్లాడే అవకాశం కల్పించాలని, సాహిత్యాన్ని చదవడంతోపాటు తెలుగు నాటకాలు, గేయాలు, హరికథలు, బుర్రకథలు తదితరాలను ప్రోత్సహించాలన్నారు.