Site icon HashtagU Telugu

Hyderabad: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టు ఆత్మహత్య

Journalist

Journalist

Hyderabad: హైదరాబాద్ లో ఓ ప్రధాన దినపత్రికలో దాదాపు ముప్పై ఏళ్ళుగా లోకల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగ్ రావు(60) ఇలా ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది. ఈ సంఘటన జర్నలిస్టులను, జర్నలిస్టు సంఘాలను తీవ్రంగా కలచివేసింది. ముప్పై ఏళ్ళుగా ఈనాడు దినపత్రికలో పనిచేస్తూ జర్నలిస్టు సంఘాలకు బాధ్యత వహిస్తూ, జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతున్న సీనియర్ జర్నలిస్టుకే ఈ పరిస్థితి రావడం అత్యంత బాధాకరమని తోటి జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ముషీరాబాద్ నియోజకవర్గం కవాడిగూడ ప్రాంతంలో దాదాపు ముప్పై ఏళ్ళుగా ప్రధాన పత్రికలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్న ఎర్రం నర్సింగ్ రావుకు రెండేళ్ళ క్రితం ఆనారోగ్యం ఏర్పడింది. ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోకపోడంతో రెగ్యులర్ గా మందులు వాడుతున్నాడు. ఖరీదైన మందులు వాడుతూ రిపోర్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకవైపు ఆరోగ్యం మెరుగు పడకపోవడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు తోడవడంతో మానసికంగా కుంగిపోయిన నర్సింగ్ రావు సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అరవై ఏళ్ల నర్సింగ్ రావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అయిన నర్సింగ్ రావు తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల తరపున చురుకైన పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. నర్సింగ్ రావు మృతి పట్ల తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ అసొసియేషన్స్ సంతాపం వ్యక్తం చేశాయి.

Exit mobile version