BRS Party: ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజక పాలన,సంక్షేమ కార్యక్రమాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు,తటస్థులు మరియు ఏర్గట్ల మండలం నాగేంద్ర నగర్ గ్రామం కాంగ్రెస్ ,బిజెపిల నుండి పలువురు యువకులు సుమారు 200 మంది మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్బంగా మంత్రి వేముల వారిని ఉద్దేశించి ప్రసంగించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ.. తలెత్తుకుని నిలబడాలనేదే కేసిఆర్ గారి తపన అని మంత్రి అన్నారు. తెలంగాణ అంతా ఒకే కుటుంబమైతే ఆ ఇంటి పెద్ద కేసిఆర్ అని,కుటుంబం ఎప్పుడూ బాగుండాలని ఇంటి పెద్ద ఆరాటపడుతడాని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలు దేశంలోనే అత్యంత ఉన్నతంగా బ్రతకాలని కేసిఆర్ తపనపడుతారని గుర్తు చేశారు. హరితాహారం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 9శాతం గ్రీనరి పెరిగిందని, ఇంత పచ్చదనం పెంపు ప్రపంచంలోనే ఇదెక్కడ సాధ్యం కాలేదన్నారు. సమాజ హితం,భవిష్యత్ తరాల కోసం మాత్రమే చేపట్టిన కార్యక్రమమని,ఓట్ల కోసమో రాజకీయం కోసమో చేసింది కాదని వివరించారు. ఇంటింటికీ సురక్షిత నల్లా నీరు అందుతుందంటే దాని వెనుక కేసిఆర్ గారి నిద్ర లేని రాత్రులు ఎన్నో ఉన్నాయని, కేవలం ఆయన అకుంఠిత దీక్ష వల్లే 3 ఏళ్లలో అది సాధ్యం అయ్యిందని అన్నారు. ప్రతీ పథకం మానవీయ కోణంలో ఆలోచించి ప్రవేశపెట్టిందే అని అన్నారు.