Site icon HashtagU Telugu

Campa Soft Drinks: సాఫ్ట్‌ డ్రింక్స్‌ పై కొత్త వ్యూహాన్ని పన్నిన జియో!

Jio Has Launched A New Strategy On Soft Drinks Campa!

Jio Has Launched A New Strategy On Soft Drinks!

భారత సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లో ఏళ్లుగా కోకాకోలా, పెప్సీదే హవా. సరళీకరణ విధానాలతో దేశంలోకి ప్రవేశించిన ఆ రెండు కంపెనీలు.. తమదైన వ్యూహాలతో మార్కెట్‌పై పట్టు సాధించాయి. మధ్యలో చాలా దేశీయ కంపెనీలు వాటికి గట్టి పోటీనివ్వాలని భావించినా అవేవీ సఫలం కాలేదు. ఏళ్ల తర్వాత ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ (Reliance) అధినేత ముకేశ్‌ అంబానీ ఒకప్పటి ఫేమస్‌ డ్రింక్‌ ‘కంపా’ను (Campa Drinks) తిరిగి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇటీవలే కోలాతో పాటు లెమన్‌, ఆరెంజ్‌ రుచుల్లో తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు గట్టి పోటీనివ్వలేకపోయినా.. క్రమంగా తన మార్కెట్‌ వాటాను పెంచుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం ఒకప్పుడు టెలికాం మార్కెట్‌లో ‘జియో’ విషయంలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేస్తోందని ఆంగ్లవార్తా సంస్థ ‘రాయిటర్స్‌’ పేర్కొంది.

ఏడేళ్ల క్రితం టెలికాం మార్కెట్‌లో రిలయన్స్‌ జియో సంచలనం సృష్టించింది. చౌక ధరకే డేటా, అపరిమిత కాల్స్‌తో భారీ సంఖ్యలో వినియోగదారులును ఆకట్టుకున్న ఆ సంస్థ.. ఇప్పుడు అతిపెద్ద టెలికాం నెట్‌వర్క్‌గా అవతరించింది. ఇదే వ్యూహాన్ని సాఫ్ట్‌ డ్రింక్స్‌ మార్కెట్లోనూ అనుసరించాలని రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ భావిస్తోంది. ఇందుకోసం ధరలు తక్కువ ధరలకే విక్రయించడంతో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన రిటైల్‌ నెట్‌వర్క్‌ను వాడుకోబోతోందని తెలిపింది. స్వదేశీ సెంటిమెంట్‌ సైతం ఆ సంస్థకు అక్కరకు రాబోతోందని రాయిటర్స్‌ తన కథనంలో తెలిపింది.

గతేడాది కంపా (Campa) బ్రాండ్‌ను కొనుగోలు చేసిన రిలయన్స్‌ ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌ ద్వారా ఉత్పత్తి చేపట్టింది. త్వరలో సొంతంగా ఫ్యాక్టరీలు లేదా జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేసి తయారీని విస్తృతం చేయాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే హోటళ్లకు, రెస్టారెంట్లకు, విమానాల్లో విక్రయానికి ఉంచాలని కంపెనీ చూస్తోంది. ప్రస్తుతం కంపా కోలా రెండు లీటర్ల బాటిల్‌ను స్టోర్లలో రూ.49లకే విక్రయిస్తున్నారు. లేబుల్‌ ధరతో పోలిస్తే ఇది సగం మాత్రమే. కోక్‌, పెప్సీతో పోలిస్తే మూడో వంతు తక్కువ ధరకే రిలయన్స్‌ ఈ పానీయాన్ని విక్రయిస్తోంది. తక్కువ ధరకే విక్రయించడం మార్కెట్‌ను పెంచుకోవడంలో భాగమని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కాబోయే ఐపీఎల్‌ క్రికెట్‌ టోర్నీలో కంపా (Campa) గురించి భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చేందుకు రిలయన్స్‌ సిద్ధమవుతోందని, రీఫ్రెష్‌మెంట్‌ పార్టనర్‌గా నియమించుకునేందుకు మూడు జట్లతో చర్చలు జరుపుతోందని తెలిపారు. రిలయన్స్‌కు దేశవ్యాప్తంగా రిటైల్‌ నెట్‌వర్క్‌ ఉంది. దాదాపు 2,500 స్టోర్లు ఉన్నాయి. ఈ నెట్‌వర్క్‌ ద్వారా కంపా సేల్స్‌ను పెంచాలని ఇప్పటికే కంపెనీ అంతర్గతంగా లక్ష్యాలు నిర్దేశించినట్లు తెలిసింది. మరోవైపు జియో మార్ట్‌ పేరుతో నిర్వహిస్తున్న షాపింగ్‌ యాప్‌ ద్వారా విక్రయాలు చేపట్టింది.

స్వదేశీ మంత్రం..

కంపాను (Campa) గ్రేట్‌ ఇండియన్‌ టేస్ట్‌, రిచ్‌ హెరిటేజ్‌ పేరుతో రిలయన్స్‌ ప్రమోట్‌ చేస్తోంది. ఇండియా ఫస్ట్‌ నినాదంతో వచ్చే కంపెనీల పట్ల సాధారణంగా అమెరికా కంపెనీలు ఆందోళన చెందుతుంటాయని పెప్సీలో గతంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఓ వ్యక్తి పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ సర్కారు సైతం ఆత్మనిర్భరతకు పెద్దపీట వేస్తుండడం ఆయా కంపెనీల్లో గుబులు పెంచుతోందని తెలిపారు. అందుకే ఆ రెండు కంపెనీలు రిలయన్స్‌ మార్కెటింగ్‌ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రిలయన్స్‌ ఔట్‌లెట్స్‌లో కంపా సాఫ్ట్‌ డ్రింక్స్‌ను ముఖ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారని రాయిటర్స్‌ పేర్కొంది. అయితే, ఏళ్లుగా విదేశీ కంపెనీల సాఫ్ట్‌ డ్రింక్స్‌కు అలవాటు పడిన జనం ఎంత మేర కంపాను ఆదరిస్తారో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందేనని  పేర్కొన్నారు.

Also Read:  Soaps: నోరూరించే సబ్బులను చూసారా మీరు!

Exit mobile version