Site icon HashtagU Telugu

Bumrah: ఓటమికి బూమ్రా చెప్పిన కారణమిదే

Jasprit Bumrah

Jasprit Bumrah

ఇంగ్లాండ్ గడ్డపై నాలుగోసారి టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది. గెలుపు లేదా డ్రాగా ఖాయమనుకున్న బర్మింగ్‌హామ్ టెస్టులో ఇంగ్లాండ్ కౌంటర్ ఎటాక్ ఎవ్వరూ ఊహించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులే ఆలౌటై భారత్‌కు 132 రన్స్ ఆధిక్యాన్ని సమర్పించుకున్నా ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ గెలవడం ఆశ్చర్యమే. ఓపెనర్లతో పాటు జో రూట్, జానీ బెయిర్ స్టో దూకుడైన బ్యాటింగ్‌కు ఆతిథ్య జట్టుకు విజయాన్నందించింది. చివరిరోజు తొలి సెషన్‌ అది కూడా కేవలం 20 ఓవర్లలోనే 129 పరుగుల బ్యాలెన్స్ టార్గెట్‌ను పూర్తి చేసిందంటే వారి జోరు ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపై తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా మాట్లాడాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించకపోవడమే ఓటమికి కారణమన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో మూడురోజుల పాటు బాగా ఆడినా నాలుగోరోజు సరిగా ఆడకుంటే ఫలితం ఇలాగే ఉంటుందన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడిందన్నాడు. ఇక సిరీస్ ఫలితంపైనా బూమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సిరీస్ తొలి మ్యాచ్‌లో వర్షం పడకుండా ఉంటే తామే గెలిచేవాళ్ళమన్నాడు.

తర్వాతి మ్యాచ్‌లలో భారత్ బాగా ఆడిందని, అయితే చివరి టెస్టులో నాలుగో రోజు ఆట మ్యాచ్‌ను మలుపుతిప్పిందన్నాడు. సిరీస్‌లో రెండు జట్లూ బాగా ఆడాయని, ఇది సరైన ఫలితమేనని అభిప్రాయపడ్డాడు. అటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో కలిసి సారథిగా పనిచేయడంపైనా బూమ్రా స్పందించాడు. జట్టులో ఆటగాళ్ళందరినీ గైడ్ చేయడానికి, సపోర్ట్ చేసేందుకు ద్రవిడ్ ఎప్పుడూ ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. టీమిండియాను లీడ్ చేసే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పాడు.