Site icon HashtagU Telugu

IPL 2022 Auction: భారీధరకు అమ్ముడైన హోల్డర్‌

Jason

Jason

ఐపీఎల్‌లో ఆల్‌రౌండర్లకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షార్ట్ ఫార్మేట్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించే ఆటగాళ్ళే ఏ జట్టుకైనా కీలకం. దీంతో మెగా వేలంలో ఆల్‌రౌండర్ల కోసం గట్టిపోటీనే నడిచింది. తొలిరోజు వేలంలో వెస్టిండీస్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ భారీ ధరకు అమ్ముడయ్యాడు. మూడో సెట్ లో వేలంలోకి వచ్చాడు. మొదటి నుంచి హోల్డర్‌ పై భారీ అంచనాలు ఉండడంతో అతనికి భారీ ధర పలికే అవకాశం ఉందముని అంతా భావించారు. అంతా అనుకున్నట్లుగానే జాసన్‌ హోల్డర్‌కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది.

కనీస ధర రూ. 1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన అతన్ని కెఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్‌జెయింట్స్‌ ఫ్రాంచైజీ రూ. 8.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. హోల్డర్‌.. ఇప్పటివరకు 26 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో 121 స్ట్రయిక్‌ రేట్‌తో 189 పరుగులు, 8.20 ఎకానమీతో 35 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో మిఛెల్ మార్ష్ గాయపడడంతో రీప్లేస్‌మెంట్‌గా సన్‌రైజర్స్‌కు ఆడిన హోల్డర్ ఆకట్టుకున్నాడు. దాదాపు అవకాశం దక్కిన ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. తాజాగా భారత్‌తో సిరీస్‌లోనూ రాణించడం హోల్డర్‌కు కలిసొచ్చిందని చెప్పొచ్చు.