Site icon HashtagU Telugu

Nadendla: ఫ్యాను గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చింది! 

Manohar

Manohar

ఫ్యాను గుర్తు చూసి ఓటేసిన ప్రజల ఇళ్లలో ఫ్యాన్లు తిరగని పరిస్థితి వచ్చిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. జగన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి భారీ ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. సంక్షేమమనే గోబెల్ ప్రచారంతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారని చెప్పారు. బుధవారం సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన మనోహర్ కి రాజమండ్రి విమానాశ్రయంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ… “మూడేళ్ల వైసీపీ పరిపాలనలో రాష్ట్రం ఆర్ధికంగా చితికిపోయింది. నిజాయితీతో కూడిన పరిపాలన అందించలేని పరిస్థితి. ఇప్పుడు వివిధ కేటగిరీలుగా ఉన్న విద్యుత్ కనెక్షన్ల ద్వారా గృహ అవసరాలకు ఉపయోగడే విధంగా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయం ఉంది.

ఈ ప్రభుత్వ పాలన సామాన్యుడిని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది. ప్రజల గురించి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏ మాత్రం బాధగాని, ఆలోచనగాని లేదు. అంధకారంలో ఉన్న రాష్ట్ర ప్రజల్ని కాపాడాలనే బాధ్యత లేకపోవడం విచారకరం. పాదయాత్రలో నవరత్నాల పేరిట చేసిన ప్రచారంతో రాష్ట్రానికి నూటికి నూరుపాళ్లు నష్టం జరుగుతోంది. విద్యుత్ ఛార్జీల పేరిట ఫార్మల్ గా నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల మీద భారం మోపాలని చూస్తే సామాన్యుడితో పాటు జనసేన పార్టీ రోడ్డు మీదకు వచ్చి ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వం దిగి వచ్చేలా పోరాటం చేస్తుంది.

కొంత మందికే ఉపయోగపడేలా, సామాన్యుడిని ఇబ్బందిపెట్టేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. ఈ అంశం మీద బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా జనసేన పార్టీ ముందుకు వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు ప్రజలకు అర్ధం అయ్యేలా చేస్తాం. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే విధంగా ప్రజలతో కలసి ఆందోళనలు చేపడతాం. ఇప్పటికే ఆరు నెలల నుంచి రోజుకు ఆరు గంటల చొప్పున అనధికారిక కోతలు విధిస్తున్నారు. ఇప్పుడు అది కాస్త 8 గంటలకు చేరింద”న్నారు నాదెండ్ల మనోహర్.

Exit mobile version