Jana Sena: ఇది ‘జగన్ స్వామ్యం’ కాదు… ‘ప్రజాస్వామ్యం’ – ‘నాదెండ్ల’

నాయకుడు అనేవాడు బాధ్యతల నుంచే పుడతాడని, ఆవిర్భావ సభను జనసైనికులు, వీరమహిళలు, వాలంటీర్లు భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Janasena

Janasena

నాయకుడు అనేవాడు బాధ్యతల నుంచే పుడతాడని, ఆవిర్భావ సభను జనసైనికులు, వీరమహిళలు, వాలంటీర్లు భవిష్యత్తు రాజకీయాలకు వేదికగా ఉపయోగించుకోవాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పోలీసు శాఖ మనకు పూర్తిగా సహకరిస్తుందనే నమ్మకం ఉందని, అలా కానీ పక్షంలో వాలంటీర్లు, నాయకులు సభా సజావుగా జరిగేలా పని చేయాలని కోరారు. విజయవాడలోని కనకదుర్గ వారధిపై జెండాలు కడుతున్న కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన బ్రిడ్జ్ పై పోలీసులకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ అడ్డుకోవాలని చూడటం బాధాకరమన్నారు. జనసేన ఆవిర్భావ సభ సన్నాహాల్లో భాగంగా సోమవారం ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశమయ్యారు నాదెండ్ల మనోహర్.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “రాజకీయ ఒత్తిళ్లతో ఇప్పటికే సభను మూడు ప్రాంతాలకు మార్చాం.  మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామస్తులు పెద్ద మనసుతో సభ నిర్వహణ కోసం స్థలాన్ని ఇచ్చారు. జనసైనికులు ఎప్పుడూ చట్టాన్ని గౌరవిస్తారు. పోలీసు శాఖ కూడా సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరుతున్నా అన్నారు నాదెండ్ల.

మీ నాయకత్వ పటిమకు పరీక్ష:

జనసేన పార్టీ ఆవిర్భావ సభను నాయకత్వ పటిమకు ఓ పరీక్షగా భావించండి. సభ నిర్వహణకు ఇప్పటికే 12 కమిటీలు వేశాం. ఎవరి బాధ్యతలు వారికి అప్పగించాం. వాటిని సమర్థంగా నిర్వహించాలి. ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మజ్జిగ ప్యాకెట్లు పంచే దగ్గర నుంచి సెక్యూరిటీ వరకు అందరికీ అప్పగించిన విధులను చక్కగా నిర్వర్తించాలి. పోలీసులు ఇప్పటికే 100 మందిని పంపుతాం.. 200 మందిని పంపుతాం అని చెబుతున్నారు. వారు ఎంతమంది వచ్చినా, మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. పోలీసులు తగినంత మంది వస్తే చాలా సంతోషం. రాకుంటే ఇంకా సంతోషం అన్నట్లుగా బాధ్యతలను వాలంటీర్లు నిర్వర్తించాలి. సభ ఎంతో చక్కగా జరిగింది అనేలా మన ఐక్యత కనిపించాలి.  పార్టీ అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారని భావిస్తున్నా. అందరికీ ఐడీ కార్డులు, టీ షర్టులు అందజేస్తాం. ప్రతి నలుగురికి ఒకరు చొప్పున వాలంటీర్లు ఉండేలా చూస్తున్నాం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోండని అన్నారు నాదెండ్ల మనోహర్.

స్థానిక సంస్థల ఎన్నికల స్ఫూర్తి గొప్పది:
అధికార పార్టీ అన్ని స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలని చూసినపుడు ఎలా ధీటుగా ఎదుర్కొని సత్తా చాటామో దానినే స్ఫూర్తిగా తీసుకోండి. భీమిలి నియోజకవర్గంలో ఓ యువతిని ఎన్నికల నుంచి విత్ డ్రా చేసుకుంటే 55 లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేసినా వెరవకుండా పోటీ చేశారు. ఆమె స్ఫూర్తి చాలా గొప్పది. అలాంటి వారి అడుగు జాడలను ఉదాహరణలుగా తీసుకొని ముందుకు వెళ్దాం. ఎన్నికల నోటిఫికేషన్ హడావుడిగా ప్రకటించినా ఎన్నికల బరిలో బలంగా నిలబడ్డాం. చాలా చోట్ల విజయాలు సాధించాం. ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దాం. కచ్చితంగా సభను విజయవంతం చేసి తీరుదాం.

ఇప్పటం గ్రామస్థులు ప్రజాస్వామ్యాన్ని కాపాడారు:
సభ కోసం కొంతమంది రైతులు ముందుకు వచ్చి స్థలాలు ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే తర్వాత అధికార పార్టీ నాయకులు వారి ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు దిగడంతో వెనక్కి తగ్గారు. అలా మూడు సభా వేదికలు మారాయి. ఇప్పటం గ్రామస్థులను సభ కోసం అడిగితే వారంతా ఒకే మాటపై నిలబడి సభకు స్థలం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ప్రజాస్వామ్యాన్ని బతికించారు. ఇది జగన్ స్వామ్యం కాదు… ప్రజాస్వామ్యం అని నిరూపించారు. ఇప్పటం గ్రామస్థులకు పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని” అన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

  Last Updated: 13 Mar 2022, 09:11 PM IST