Jana Sena : కొవ్వూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన సమన్వయకర్త టి.వి. రామారావు పై పార్టీ అధిష్టానం క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా, ఆయనను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్టు పార్టీ కాన్ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి వేములపాటి అజయ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు. పార్టీకి విఘాతం కలిగించే విధంగా కార్యకలాపాలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని సహకార సొసైటీల పదవుల విషయంలో అన్యాయాలు జరిగాయని ఆరోపిస్తూ, టి.వి. రామారావు నాయకత్వంలో జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో కూడా నిర్వహించడంతో ఇది స్థానికంగా పెద్ద వివాదంగా మారింది. నియోజకవర్గంలోని 14 సహకార సొసైటీల్లో కనీసం మూడు పదవులు తమ పార్టీకి ఇవ్వాలని టి.వి. రామారావు డిమాండ్ చేశారు. ఈ డిమాండును అమలు చేయకపోవడంతో ఆయన ఆందోళన బాట పట్టారు.
Read Also: Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్?
అయితే, పార్టీ అధిష్టానాన్ని ముందుగా సంప్రదించకుండా రామారావు స్వయంగా కార్యక్రమాలు చేపట్టిన విధానం పార్టీ సూత్రాలకు విరుద్ధంగా ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా కాకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు, చర్యలు కూటమి స్ఫూర్తికి భంగం కలిగించాయనే అభిప్రాయంతో పార్టీ తీవ్రంగా స్పందించింది. అందువల్లే ఆయనను ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తూ తక్షణ ఆదేశాలు జారీచేసినట్టు వేములపాటి అజయ్ కుమార్ తెలియజేశారు. అంతేకాదు, తుది నిర్ణయం వచ్చేవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు. టి.వి. రామారావు రాజకీయ ప్రస్థానం విస్తృతమైనది. 2009లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే, ఒక కేసు నేపథ్యంలో ఆయన రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. దాంతో 2014 ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాలేదు. అయినప్పటికీ, టీడీపీ అభ్యర్థి కె.ఎస్. జవహర్ గెలుపుకు సపోర్ట్ చేశారు.
2019 ఎన్నికల్లోనూ టీడీపీ టికెట్ నిరాకరించడంతో, టి.వి. రామారావు వైసీపీలో చేరారు. ఆ సమయంలో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి తానేటి వనితకు మద్దతుగా నిలిచారు. అయితే పార్టీలో నిరాశ చెందిన ఆయన 2023లో వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్ల నమ్మకం పెట్టుకుని పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న టి.వి. రామారావు, కొవ్వూరు నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడిలా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం, పార్టీ పరంగా గందరగోళం సృష్టించడమే కాకుండా, రాజకీయ కూటములకు ఇబ్బందులు కలిగించే స్థితిని తీసుకురావడంతో పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో టి.వి. రామారావు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.