Jana Sena:’ ఏపీ’ని అంధకారంలోకి నెట్టి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు – ‘నాదెండ్ల మనోహర్’..!

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

Published By: HashtagU Telugu Desk
Jana Sena Manohar

Jana Sena Manohar

వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని అంధకారంలోకి నెట్టేసి వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. కొత్త మంత్రి వర్గం, అందర్నీ నూతనంగా ఎంపిక చేస్తున్నాం, అద్భుత పాలన అందించడానికి మార్పులు చేస్తున్నామని ఆ పార్టీ నాయకులు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలు ఇళ్లలో ఒక ఫ్యాను, బల్బు కూడా వెలిగించుకోలేని దుస్థితి తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకు తీసుకువెళ్లి ఎండగడతామని తెలిపారు.

కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం కోసం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి అసెంబ్లీ ఇంచార్జి కిరణ్ రాయల్, ఇతర నాయకులు, శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. “విద్యుత్ ఛార్జీలు పెంచి కోతలు విధిస్తూ రాష్ట్ర ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. రాయలసీమ నుంచి యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారు. కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్థితి. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిండు మనసుతో మేమున్నామంటూ భరోసా నింపడానికి, రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం రూ 5 కోట్ల విరాళం ప్రకటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవడం లేదు.

ఈ పరిస్థితుల్లో జనసేన పార్టీ వారికి అండగా నిలబడుతుంది. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కౌలు రైతు ఇంటికీ వెళ్లి రూ. లక్ష అందించి భరోసా ఇచ్చే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 12వ తేదీన అనంతపురం జిల్లాలో ప్రారంభిస్తున్నాం. ఈ రోజు రైల్వే కోడూరులో పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం. కడప జిల్లాలో జనసేన జెండా ఎగురవేసే విధంగా, మా నాయకుల్లో ఉత్సాహం నింపే విధంగా పని చేస్తాం” అన్నారు.
అంతకు ముందు రేణిగుంట విమానాశ్రయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మనోహర్ కి ఘన స్వాగతం పలికారు. రాయలసీమ నాయకులు రాందాస్ చౌదరి, తిరుపతి నగర అధ్యక్షులు రాజారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సయ్యద్ ముకరం చాంద్, శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, శ్రీమతి ఆరణి కవిత, పార్టీ నాయకులు డాక్టర్ బోనాసి వెంకట సుబ్బయ్య, యుగంధర్ పొన్న, శ్రీమతి వినుత కోట, దాశరధి, దయారాం స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

  Last Updated: 10 Apr 2022, 11:49 PM IST