Site icon HashtagU Telugu

Jana Sena: అంతర్వేది రథం దగ్ధం కేసులో ‘జగన్’ సర్కార్ చిత్తశుద్దితో వ్యవహరించలేదు – ‘నాదెండ్ల మనోహర్’ !

Nadella

Nadella

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్దం కేసు విషయంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించలేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నిజాయతీగా, చిత్తశుద్ధితో ఉండి ఉంటే దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ అంటూ ఉత్తరం రాసి వదిలేశారనీ, కొత్త రథం చేయించి ఇచ్చేశాం కదా… పాత రథం గురించి ఎందుకు అన్న చందంగా ముందుకు ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు.

మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా శుక్రవారం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మంటపంలో వేద పండితులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ “నరసింహస్వామి వారి రథం దగ్దమైనప్పుడు అందరూ బాధపడ్డారు. ఎక్కడ ప్రజలు మరింత ఆవేదనకు లోనయ్యారు. పవన్ కళ్యాణ్ వెంటనే టెలీకాన్ఫరెన్స్ పెట్టి స్థానిక నాయకులతో మాట్లాడారు. దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. లా అండ్ ఆర్డర్ బలంగా ఉంటే ఇలాంటి తప్పిదాలు జరగవు. ఇలాంటి పొరపాట్లు జరిగితే అవససరంగా వేరే ప్రాంతాల్లో కలహాలు సృష్టించే పరిస్థితులు వస్తాయి. ఈ పాలకులకు చిత్తశుద్ది ఉంటే నిజాయితీగా పని చేయాలి.
మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా నాలుగు రోజులుగా తూర్పు గోదావరి జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో పర్యటించడం జరిగింది. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాల గురించి తెలుసుకున్నాం. ప్రతి మత్స్యకార గ్రామంలో మహిళలు రోడ్డు మీదకు వచ్చి తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మత్స్యకారులకు భరోసా, బీమా పథకాలు అందడం లేదు.

పవన్ కళ్యాణ్ నరసాపురంలో నిర్వహించే సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు తరలివచ్చి విజయవంతం చేసేందుకు సిద్దంగా ఉన్నారు” అన్నారు. దర్శనం అనంతరం అంతర్వేది ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.