Site icon HashtagU Telugu

Jana Sena Demand:’పోరస్ కెమికల్ కర్మాగారం’లో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని ‘పవన్’ డిమాండ్..!

Pawankalyan

Pawankalyan

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ప్రమాదంలో చనిపోయినవారికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకూడదు. ఈ ఘటనలో మరో 13మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలి. ఇటువంటి ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.