Jana Sena: వైద్య ఆరోగ్య శాఖను నిర్వీర్యం చేసిన ఘనత ‘జగన్ రెడ్డి’దే – ‘నాదెండ్ల మనోహర్’..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు రోజు రోజుకీ దిగజారుతుండటం వైసీపీ సర్కార్ వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

Published By: HashtagU Telugu Desk
Nandendla Manohar

Nandendla Manohar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు రోజు రోజుకీ దిగజారుతుండటం వైసీపీ సర్కార్ వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం వల్ల రామకృష్ణ అనే లెక్చరర్ మృతి చెందిన ఘటన శోచనీయం. ప్రమాదంలో గాయాల పాలై వచ్చిన వ్యక్తికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నిండు ప్రాణం పోయింది.

సమయానికి అంబులెన్సులు రావు… ఆసుపత్రికి వస్తే వైద్యం చేయరు. ఇన్ పేషెంట్లకు బెడ్ కేటాయించరు. ఫుట్ పాత్ మీదే ఉంటూ వైద్యం తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కనీసం చనిపోయిన వారిని తరలించేందుకు వాహనాలు ఇవ్వరు. ప్రతి రోజూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకొంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో కనీసం చలనం రావడం లేదు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఆయన ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం అవుతోంది.

ఈ శాఖను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డిదే. కేంద్ర ప్రభుత్వం నుంచి రూరల్ హెల్త్ మిషన్, అర్బన్ హెల్త్ మిషన్ పథకాల ద్వారా రూ.వేల కోట్లు నిధులు వస్తుంటే.. వాటిని ఎటు మళ్లిస్తున్నారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కోవిడ్ మృతులకు ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని కూడా పక్కదారి పట్టించినవాళ్ల నుంచి వైద్య సేవలు ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రభుత్వం నుంచి వైద్యం సేవలు పొందటం ప్రజలకు ఉన్న హక్కు. ఈ సేవలు అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలి అని అన్నారు నాదెండ్ల మనోహర్.

  Last Updated: 11 May 2022, 12:39 PM IST