Plane Crash: లండన్‌కు చెందిన యోగా ప్రేమికుడు జేమీ మీక్, తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని అనుభవాలతో భారత పర్యటనను ముగించుకున్నాడు. గుజరాత్‌లోని ఆధ్యాత్మికత, భారతీయ సంస్కృతి, రంగులు, రుచులు అన్నీ కలిసిన ఈ ప్రయాణం ఆయన హృదయంలో చెరగని ముద్ర వేసింది. తన జీవిత భాగస్వామి ఫియాంగల్ గ్రీన్‌లా మీక్‌తో కలిసి ఆయన గడిపిన క్షణాలు ఒక మాయాజాలంలా అనిపించాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో చివరి రోజు జేమీ పోస్ట్ చేసిన మాటలు ఆ భావోద్వేగాన్ని తెలిపాయి. “ఇది భారత్‌లో గడుపుతున్న మా చివరి రాత్రి. ఇది ఒక మాయాజాలం. ప్రతి క్షణం ఓ జ్ఞాపకం.” అని పేర్కొన్నాడు. ఎక్కడికైనా వెళ్లడం సహజమే కాని, భారతదేశం మాయచేసిందనేది ఆయన పదాల్లో స్పష్టంగా కనిపించింది.
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయి పాటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఉదయం, విమానం ఎక్కేముందు మరో వీడియోలో జేమీ ఇలా అన్నారు “గుడ్‌బై ఇండియా…” అని. ఆ మాటల్లో కొంత నొప్పి, కొంత కృతజ్ఞత, మరికొంత ప్రేమ కలగలిపిన వాస్తవం కనిపించింది.
అయితే.. అదే విమానం ఎయిర్ ఇండియా AI 171 మధ్యాహ్నం 1.30కి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన కొద్దిక్షణాల్లోనే ప్రమాదానికి గురైంది. విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దాదాపు 100కు పైగానే ప్రయాణికులు మృతిచెందినట్లు తెలుస్తోంది. జేమీ మీక్, ఫియాంగల్ గ్రీన్‌లా మీక్ పరిస్థితి ఏంటి అన్నది ఇంకా స్పష్టతలేని ప్రశ్నగానే మిగిలింది. భారతదేశంలో అనుభవించిన అందమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ వెళ్లిన జేమీకి, జీవితం ఎటువంటి మలుపులు తిప్పుతుందో అని చెబుతోంది ఈ ఘటన.