Robbery : జైపూర్‌లోని పంచవటి సర్కిల్‌లో మొబైల్ షోరూం నుంచి ఐఫోన్లు దోచుకుని బంగ్లాదేశ్‌కు తరలించేందుకు యత్నించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో 120 కొత్త ఐఫోన్లు, 150 పాత ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్‌బుక్‌లు, ఇతర షోరూమ్ వస్తువులు, రూ. 3.85 కోట్ల నగదు, దొంగతనానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
మొబైల్ షాప్ యజమానిని పరిచయం వేసుకున్న నిందితుడు
నిందితుల్లో ప్రధానుడు సఫన్ ఖాన్, షోరూం యజమాని రమీంద్రసింగ్ మఖీజా పాత స్నేహితుడు. రమీంద్రసింగ్ జైపూర్‌లో షోరూం ప్రారంభించిన విషయం తెలుసుకున్న సఫన్‌ఖాన్, ముంబైలో తన ముఠాతో కలసి దోపిడీ ప్రణాళిక రచించాడు. ఐఫోన్లు చోరీ చేసి, బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్ చేయాలని వారు నిర్ణయించారు. ఈ నెల 6న రాత్రి ముగ్గురు దొంగలు మాస్కులు ధరించి షట్టర్ తెరిచి షోరూం లోపలికి చొరబడ్డారు. వారు రూ. 2 కోట్ల విలువైన వస్తువులను దోచుకున్నారు. దోపిడీ తర్వాత బైక్‌పై 50 కిలోమీటర్లు వెళ్లి అక్కడ వదిలేసి, అద్దె కారులో పారిపోయారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు వీరి కదలికలను గుర్తించారు.
పోలీసులు గట్టి వేట ప్రారంభించి, మధ్యప్రదేశ్‌కు చెందిన సఫన్ ఖాన్ (30), రామ్‌భరోస్ పటేల్ (27), జతిన్ హడా (18), రాజేశ్ అలియాస్ ఖన్నా అలియాస్ మామా (45)లను అరెస్టు చేశారు. దోపిడీ ఫోన్లను కొనుగోలు చేసిన ముంబైకు చెందిన సమీర్ అహ్మద్ షేక్ (38)ను కూడా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ. 1.5 కోట్ల విలువైన దోపిడీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సమీర్ అహ్మద్ విచారణలో, చోరీ చేసిన ఫోన్లను బంగ్లాదేశ్‌కు తరలించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. గతంలోనూ ఇలాగే ఫోన్లను తరలించినట్లు తెలిపారు.
జైపూర్ పోలీస్ కమిషనర్ బిజు జార్జ్ జోసెఫ్ మాట్లాడుతూ, నిందితుల నుంచి మొత్తం రూ. 2 కోట్ల విలువైన ఐఫోన్లు, రూ. 3.85 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతుందని, ఈ చోరీకు సంబంధించిన మరిన్ని వివరాలను బయటపడతాయని తెలిపారు. ఈ అరెస్టులతో బంగ్లాదేశ్‌కు స్మగ్లింగ్ చేసే ముఠాపై గట్టి దెబ్బ తగిలినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Azhar Ali: పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో పెను మార్పు.. ఏంటంటే?