Iran: డ్యాన్స్ చేసినందుకు జైలు శిక్ష.. ఎక్కడో తెలుసా?

సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా చాలామంది డ్యాన్సులు, మిమిక్రీ, యాక్టింగ్ లాంటివి చేస్తుంటారు.

  • Written By:
  • Publish Date - February 1, 2023 / 10:17 PM IST

Iran: సోషల్ మీడియాలో ఫేమస్ అవడానికి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగా చాలామంది డ్యాన్సులు, మిమిక్రీ, యాక్టింగ్ లాంటివి చేస్తుంటారు. అలా ఓ జంట డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దాని మీద పోలీసులు రియాక్ట్ అయ్యారు. పలు సెక్షన్ల కింద సదరు జంట మీద కేసులు నమోదు చేసి ఏకంగా జైలుకు పంపించారు.

ఇరాన్ లో హిజాబ్ మీద తీవ్ర దుమారం రేగుతోంది. అక్కడ మహిళలు హిజాబ్ ను ఖచ్చితంగా ధరించాల్సిందే అని ప్రభుత్వం కఠినంగా చట్టాన్ని అమలు చేస్తోంది. అయితే తాజాగా ఓ జంట టెహ్రాన్ లోని ఆజాది టవర్ వద్ద డ్యాన్స్ చేసిన వీడియో వారిని జైలుపాలు చేసింది. 21 ఏళ్ల ఆస్తియాజ్ హకికీ, కాబోయే భర్త మహమ్మద్ అహ్మదీతో కలిసి డ్యాన్స్ వీడియో చేసి.. ఆస్తియాజ్ హకికీ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇరాన్ లో బహిరంగ ప్రదేశాల్లో డ్యాన్స్ చేయడం నేరం. దాంతో సదరు జంట మీద పోలీసులు పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. వ్యభిచారాన్ని ప్రోత్సహించడం, జాతీయ భద్రతకు వ్యతిరేకంగా కుట్రలు. అవినీతి వంటి పలు ఆరోపణల కింద వారిని అరెస్టు చేయగా.. వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఇరాన్ లో ఇది ట్రెండ్ అవుతోంది. ఒక్క డ్యాన్స్ వీడియో ఇద్దరి జీవితాలను మార్చేసిందనే విమర్శలు వస్తున్నాయి.

అయితే అంతకు ముందే ఇరాన్ లో హిజాబ్ ధరించలేదని ఓ మహిళను పోలీసులు అరెస్టు చేయగా.. ఆమె కస్టడీలో మరణించింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు మొదలయ్యాయి. ఈ నిరసనల మీద ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తుండగా.. నిరసనలకు మద్దతుగా నిలిచే వాళ్ల పట్ల కూడా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. తాజాగా డ్యాన్స్ వీడియో చేసిన జంట మీద కూడా హిజాబ్ నిరసనలకు లింక్ చేస్తూ పోలీసులు కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.