Jagga Reddy: ఇకపై బహిరంగ విమర్శలు ఉండవు

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.

  • Written By:
  • Updated On - April 7, 2022 / 11:05 AM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అంతేకాదు.. టీ కాంగ్రెస్ లో రేవంత్ వర్సెస్ సీనియర్ల వర్గం అన్నట్టుగా మారింది సీన్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు తీవ్రస్థాయికి చేరడంతో ముఖ్య నేతలంతా ఢిల్లీ వేదికగా అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. అయితే రాహుల్ దిశా నిర్దేశం చేయడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా మౌనం వహించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఫ్యామిలీ రాహుల్ గాంధీని కలవడం ప్రత్యేకత సంతరించుకుంది.

“నా కుటుంబ సభ్యులతో కలిసి రాహుల్ గాంధీని కలవాలని అనుకున్నాను. అది ఈరోజు కుదిరింది.రాజకీయాల కంటే ముందు మా పిల్లల చదువుల గురించి అడిగారు. బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత విద్వేషాలతో రాజకీయం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీతో పాటు మొత్తం ఈ మూడు పార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేలా కలసికట్టుగా పనిచేసి, ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తాం. రాహుల్ గాంధీ ముందు ఏ అంశాన్ని ఎత్తలేదు.

అన్నీ మర్చిపోయాను. మొన్నటి సమావేశంలో ఇచ్చిన సందేశం మేరకు కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళతాం. మనం, మన కుటుంబం అంటే.. ప్రజలు, దేశం అన్నట్టుగా మేమంతా కలసికట్టుగా పనిచేస్తాం. బహిరంగ విమర్శలు ఇకపై ఉండవు. పార్టీలో ఇప్పుడు సమస్యలే లేవు. కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ నేతలతో కూడా పార్టీ అంశాల గురించి చర్చించా” అని జగ్గారెడ్డి వెల్లడించారు.