Site icon HashtagU Telugu

Nalgonda: మంత్రి కోమటిరెడ్డికి జగదీశ్ రెడ్డి వార్నింగ్

Jagadeesh Reddy

Jagadeesh Reddy

Nalgonda: రానున్న లోకసభ ఎన్నికల్లో బి ఆర్ యస్ పార్టీ విజయ దుందుభి మోగించనున్నదని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జరిగిన పొరపాటును సరిదిద్దుకునేందుకు తెలంగాణా సమాజం సన్నద్ధం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.రానున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని శనివారం నుండి శాసనసభ నియోజకవర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలన్న పార్టీ నిర్ణయం మేరకు శనివారం మధ్యాహ్నం నల్లగొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నల్లగొండ మాజీ శాసనసభ్యుడు కంచర్ల కృష్ణారెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరు కాగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ యం ఎల్ ఏ ఎన్.రవీంద్ర కుమార్, నల్లగొండ, భోనగిరి జడ్ పి చైర్మన్ లు బండా నరేందర్ రెడ్డి,యం ఎల్ సి యం సి కోటిరెడ్డి, మాజీ శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,ఎన్.భాస్కర్ రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ హామీలు అమలు చెయ్యలేకనే చెప్పులతో దాడులు అంటూ అధికార పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ, రైతుబంధు డిమాండ్లు ప్రజల నుండి వచ్చినవే నన్నారు.అధికారంలోకి వచ్చిందే తడవుగా వారి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని అమలు చేస్తామన్న రెండు లక్షల రుణమాఫీ ఏమైందని ఆయన సూటిగా ప్రశ్నించారు. దామరచర్ల పవర్ ప్లాంట్ విషయంలో అసెంబ్లీ సాక్షిగా న్యాయ విచారణ చేపట్టాలని చాలెంజ్ విసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వ్యక్తిగత విమర్శలకు తానూ దిగితే వారు రోడ్ల మీద కుడా తిరగలేరని పరోక్షంగా మంత్రి కోమటిరెడ్డి కి ఆయన వార్నింగ్ ఇచ్చారు.అధికారం ఎప్పుడూ ఎవరికీ శాశ్వతం కాదని,తాము అధికారంలో ఉండగా ఈ తరహా దాడులకు ఉసి గొల్పలేదన్నారు.తెలంగాణా ఏర్పాటుకు ముందు కృష్ణా జలాలను నాటి ముఖ్యమంత్రులు వై యస్ ,చంద్రబాబులు అక్రమంగా తరలించుకుని పోతుంటే చోద్యం చూస్తూ బీ-ఫారాలకు భయపడి పెదవులకు పదవులు అడ్డుపడి నోర్లు ముసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. వీరి బాస్ లు చంద్రబాబు, వై యస్ లు కేసులు పెట్టిన రోజునే తెలంగాణా ఉద్యమ పార్టీ నేతలు భయపడ లేదని వారి అడుగులకు మడుగులొత్తి అధికారం లోకి వచ్చిన వారికి మేము భయపడే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు.

ఆ మాటకు వస్తే అసలు తెలంగాణా సమాజానికి పోరాటాలు నేర్పిందే నల్లగొండ జిల్లా అని అటువంటి జిల్లా నుండే ప్రభుత్వ హామీల అమలుకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా బిజెపి తో కుమ్మక్కు ఆయిన అధికార కాంగ్రెస్ పక్షం మున్సిపల్ చైర్మన్ లపై అవిశ్వాస తీర్మానాలకు శ్రీకారం చుట్టారని ఆయన ఆరోపించారు. అటువంటి అక్రమ పొత్తులను ఎండగట్టిన సూర్యాపేట పాలకవర్గం కాంగ్రెస్,బిజెపి ల అక్రమ సంబంధాన్ని అడ్డుకుందన్నారు.మళ్ళీ గులాబీ విజయ కేతనం సూర్యాపేట నుండే మొదలైందని కాంగ్రెస్ బిజెపి లు కలిసి చేసుకున్న ఒప్పందం బెడిసి కొట్టిందని ఆయన విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయిలో కత్తులు ప్రాంతీయ స్థాయిలో పొత్తులు పెట్టుకున్న కాంగ్రెస్ బిజెపి లు అసెంబ్లీ ఎన్నికల్లో లోపాయకారి ఒప్పందాలు మున్సిపల్ అవిశ్వాస తీర్మానాల విషయంలో బాహాటంగానే బయట పడ్డాయన్నారు. వారం పది రోజుల్లో గులాబీ బాస్ ప్రజలలోకి రానున్నారని ఆయన వెల్లడించారు. రానున్న లోకసభ ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు గాను పార్టీ సుప్రీం కేసీఆర్ త్వరలో నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.

Exit mobile version