Jacqueline Fernandez: 200 కోట్ల స్కామ్ : జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ పై 8 గంటలు ప్రశ్నల వర్షం

  • Written By:
  • Publish Date - September 14, 2022 / 11:18 PM IST

హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఈరోజు దాదాపు 8 గంటలు ప్రశ్నించింది. ఉదయం 11.30 గంటల నుంచి దాదాపు 8 గంటల పాటు ఏకధాటిగా ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో ముడిపడి ఉన్న రూ.200 కోట్ల దోపిడీ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ ను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం క్వశ్చనింగ్ చేస్తోంది. సుకేష్‌తో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి ? అతని నుంచి ఆమెకు లభించిన బహుమతుల వివరాలు ఏమిటి? ఎందుకు ఆ గిఫ్ట్స్ ఇచ్చినట్టు? సహా ఎన్నో ప్రశ్నలను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం సంధించినట్లు తెలుస్తోంది. మాయగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్‌ను పరిచయం చేసిన పింకీ ఇరానీని కూడా ఈడీ విచారిస్తోంది. జాక్వెలిన్‌ను, పింకీ ఇరానీని ఎదురెదురుగా కూర్చోబెట్టి ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఈక్రమంలో హీరోయిన్ జాక్వెలిన్‌ ఇచ్చిన సమాధానాల్లో కొన్ని లొసుగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఛార్జ్‌షీట్‌లోనూ జాక్వెలిన్ పేరు..

200 కోట్ల బెదిరింపు కేసులో న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో పోలీసులు దాఖ‌లు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్ న‌మోదు చేసిన స‌ప్లిమెంట‌రీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేర‌స్థుడు సుకేశ్ చంద్ర శేఖ‌ర్ నుంచి జాక్వెలిన్ ఖ‌రీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. మ‌నీలాడ‌రింగ్ కేసులో జాక్వెలిన్‌ను గతంలో కూడా ఈడీ విచారించింది. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి న‌టి జాక్వెలిన్ ఖ‌రీదైన పలు ఖరీదైన వ‌స్తువుల్ని తీసుకున్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.
కాగా.. ఈడీ‌ అటాచ్‌ చేసిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తన కష్టార్జితమని జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ అంతకుముందు తెలిపారు. రూ. 200 కోట్ల కుంభకోణంలో మనీల్యాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఇచ్చిన బహుమతులు కాదంటూ స్పష్టంచేశారు. తన సంపాదనకు సంబంధించి ఆదాయపు పన్ను కూడా చెల్లించానని, క్రైమ్‌ ప్రొసీడింగ్స్‌ను నిలిపి వేయాలంటూ జాక్వెలిన్ ఈడీని కోరారు. మాయగాడు సుకేశ్‌తో పరిచయం లేనప్పుడే, ఎఫ్‌డీలపై పన్ను చెల్లించినట్లు అంతకుముందు ఈడీకి ఇచ్చిన సమాధానంలో జాక్వెలిన్‌ తెలిపారు.

215 కోట్ల రూపాయలను ఇలా..

ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి బెయిల్ ఇప్పిస్తానంటూ… అతని భార్య నుంచి 215 కోట్ల రూపాయలను సుఖేశ్ చంద్రశేఖర్ బురిడీ కొట్టించాడు. వ్యక్తిగత ఆర్థిక ఇబ్బందులను పరిష్కరిస్తానని చెప్పి సుఖేశ్ చంద్రశేఖర్ మోసం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.
.సెప్టెంబర్‌ 14న విచారణకు హాజరు కావాలని బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ పోలీసులు స‌మ‌న్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. జాక్వెలిన్‌కు స‌మ‌న్లు జారీ చేయ‌డం ఇది మూడో సారి. గ‌తంలో రెండు సార్లు స‌మ‌న్లు జారీ చేసినా.. బిజీ షెడ్యూల్ వల్ల విస్మరించానని చెప్పుకొచ్చింది జాక్వెలిన్‌. సుఖేశ్ చంద్రశేఖర్ తీహార్ జైలు నుంచి నడిపించిన దోపిడీ దందాపై జాక్వెలిన్‌ను ప్రశ్నించనున్నారు ఢిల్లీ పోలీసులు. కాగా, మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఇక, ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌నూ ఈడీ నిందితురాలిగా చేర్చింది. సుఖేశ్ చంద్రశేఖర్… 10 కోట్ల విలువ చేసే బహుమతులను ఆమెకు పంపినట్టు ఈడీ దర్యాప్తులో తేలింది. ఇదే కేసులో కొన్ని రోజుల క్రితం నటి నోరా ఫతేహిని… గతంలో ఆరు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.