Site icon HashtagU Telugu

Shoaib Akhtar: కోహ్లీ ఆటతీరు మార్చుకోకుంటే కష్టమే : అక్తర్

Virat Shoaibh Imresizer

Virat Shoaibh Imresizer

రాయల్ చాలెంజర్స్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ ఐపీఎల్‌ 2022 సీజన్‌ లోనూ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 125.26 స్ట్రయిక్‌ రేట్‌తో కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు . ముఖ్యంగా కోహ్లి జట్టుకు మంచి ఆరంభం సాధిస్తున్నప్పటికి పెద్ద స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నాడు. ఈ సీజన్ లో అనవసరంగా లేని పరుగు కోసం యత్నించి రెండుసార్లు రనౌట్‌ గా పెవిలియన్ చేరగా.. ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌లో థర్డ్‌ అంపైర్‌ పొరపాటు కారణంగా ఎల్బీగా మైదానాన్ని వీడాడు. అయితే ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలన్న విరాట్ కోహ్లికి ఆశ తీరేలా కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్‌ అక్తర్‌ తన ఆటతీరు మార్చుకోవాలంటూ విరాట్ కోహ్లికి సూచించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అక్తర్ మాట్లాడుతూ.. ఐపీఎల్ 15వ సీజన్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. అయితే పరుగులు చేయకపోతే సహించేది లేదు. కోహ్లీ సరిగ్గా ఆడకపోతే తుదిజట్టు నుంచి తప్పించొచ్చు. ఎందుకంటే ఆర్సీబీ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న యువ ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారు. కోహ్లీ ఒక గొప్ప క్రికెటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తనను తానూ ఒక స్టార్ ఆటగాడు అని అతను ఇకపై భావించకూడదు.ఎందుకంటే అతని కెరీర్ ప్రస్తుతం ప్రమాదంలో ఉంది. అందుకే కోహ్లీ కేవలం తనని తాను ఒక సాధారణ ఆటగాడిగా భావించాలి. బ్యాట్‌ అందుకొని పరుగుల ప్రవాహం సృష్టించడమే పనిగా పెట్టుకోవాలి అని అక్తర్‌ వెల్లడించాడు.