KTR : నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమర్థించారు. దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే.. ఆయా రాష్ట్రాలు అందిస్తున్న ఆర్థిక భాగస్వామ్యానికి అనుగుణంగా చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దేశానికి అత్యవసరమైనప్పుడు కుటుంబ్ర నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని అన్నారు.
Read Also: AAP : రాజ్యసభకు అరవింద్ కేజ్రీవాల్..ఆప్ వివరణ !
దేశ నిర్మాణంలో తెలంగాణ, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కృషిని ఎవరూ విస్మరించలేరని పేర్కొన్నారు. దేశ జనాభాలో తెలంగాణ కేవలం 2.8 శాతం మాత్రమే ఉండగా.. జీడీపీకి 5.2 శాతం భాగస్వామ్యం అందిస్తోందని కేటీఆర్ వివరించారు. దేశ అవసరాలకు తగినట్లు కుటుంబ నియంత్రణను బాగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షించడం తగదని కేటీఆర్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల పనితీరును పరిగణనలోకి తీసుకోకుండా పునర్విభజన చేయడం ప్రజాస్వామ్య, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు.
కాగా, దక్షిణాది రాష్ట్రాలపై డీలిమిటేషన్ పేరుతో కత్తి వేలాడుతోందని స్టాలిన్ అన్నారు. తమిళనాడు కుటుంబ నియంత్రణ కార్యక్రమం ద్వారా జనాభాను నియంత్రించింది. తమిళనాడులో జనాభా తక్కువగా ఉంది కాబట్టి, లోక్‌సభ స్థానాలు తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో మేము దాదాపు ఎనిమిది సీట్లు కోల్పోతామన్నారు. ఆ తర్వాత మాకు 31 మంది ఎంపీలు మాత్రమే ఉంటారు. ప్రస్తుతం పార్లమెంటులో తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని స్టాలిన్ గుర్తు చేశారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చర్చించడానికి మార్చి 5న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నారు.