Site icon HashtagU Telugu

Gold Investment: బంగారం ఇప్పుడు కొనడం కరెక్టేనా? మరో నెల రోజుల్లో పుత్తడి ధర ఎంతవుతుందంటే..?

gold photo

gold photo

ప్రపంచంలో ఎక్కడేం జరిగినా మన దేశంలో బంగారం ధర భగ్గుమంటుంది. ఎందుకంటే మన దగ్గర పుత్తడి వినియోగం ఎక్కువ. ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అలా మొదలైందో లేదో.. స్వర్ణం ధరకు రెక్కలు వచ్చేశాయి. సమరానికి ముందు.. పది గ్రాముల పసిడి ధర రూ.48,600 ఉంటే.. ఇప్పుడు రూ.54 వేలకు చేరింది. ఒకవేళ ఈ సమరం కాని ఇప్పట్లో ఆగకపోతే.. గోల్డ్ రేటు పెరుగుతూనే ఉండొచ్చు. మరి అలాంటప్పుడు బంగారాన్ని కొనాలా వద్దా.. ఇలా చాలామందికి బోలెడన్ని అనుమానాలు. అసలింతకీ పుత్తడి ధర రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది?

బంగారం రేటు పెరగడానికి ఎన్ని కారణాలున్నా దానికి ముఖ్యమైనది మాత్రం రష్యా-ఉక్రెయిన్ వార్. ఎందుకంటే బంగారం ఎక్కువగా రష్యా నుంచి వస్తుంది. ఇప్పుడు ఇతర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో సరఫరా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి రేటు పెరిగే ఛాన్సుంది. ఇప్పటికిప్పుడు మన దేశంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా లేవు. అయినా ఎందుకు డిమాండ్ పెరుగుతుంది అంటే.. ఒకవేళ భవిష్యత్తులో గోల్డ్ రేటు పెరుగుతుందేమో… అప్పుడు కొనలేమేమో అన్న అనుమానం, భయంతో ఇప్పుడే కొనేవారు పెరిగిపోతారు. అందుకే ధర పెరిగే ఛాన్సుంది.

రష్యా యుద్ధం దెబ్బకు స్టాక్ మార్కెట్లు కుదేలైపోతున్నాయి. దీనిని తట్టుకోలేక ఆ దేశమే ఆమధ్య మూడు రోజులపాటు స్టాక్ మార్కెట్లకు తాళం వేసుకుని కూర్చుంది. దీంతోపాటు యుద్ధ పరిణామాల వల్ల మన రూపాయి మారక విలువ కూడా తగ్గుతోంది. అందుకే ఎక్కువమంది బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్లే పుత్తడి ధర క్రమంగా పెరుగుతోంది. గత వారంలో ఒకే రోజులో 10 గ్రాములకు రూ.1000 పెరిగింది. ఇలాంటి పరిణామాలను చూసి వినియోగదారులు ఎక్కువగా, వేగంగా కొనడానికి ప్రయత్నిస్తున్నారు.

ప్రస్తుతానికి అయితే అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ గోల్డ్ రేటు 2000 డాలర్ల వరకు పెరగొచ్చు. కాకపోతే ఈ స్థాయికి రావాలంటే.. ముందుగా 1985 డాలర్లను దాటాలి. అప్పుడు మాత్రమే 2000 డాలర్ల మార్క్ ని చేరుకునే ఛాన్స్ ఉంటుంది. పుత్తడి ధర గూబ గుయ్యిమనిపిస్తుండడంతో ఫెడరల్ రిజర్వ్ తన పాలసీని ఛేంజ్ చేస్తుందా అన్న అభిప్రాయాలున్నాయి. కాకపోతే ప్రపంచవ్యాప్తంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భయం మాత్రం తగ్గడం లేదు. పైగా ద్రవ్యోల్బణ బూచి కూడా అందరినీ వణికిస్తోంది. అందుకే బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు పెరుగుతున్నారు.

ముడిచమురును సప్లయ్ చేసే దేశాల్లో రష్యా కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి అది సప్లయ్ చేసే అవకాశం తక్కువ. అందుకే మార్కెట్ లో బ్యారెల్ ముడిచమురు ధర 100 డాలర్లకు పైనే ఉంది. ఒకవేళ పెట్రో ధరలు కాని పెరిగాయా.. దాని దెబ్బకు నిత్యావసరాలతోపాటు అన్నింటి ధరలు పెరుగుతాయి.. దీంతో ద్రవ్యోల్బణం కూడా ఎక్కువవుతుంది. అంతర్జాతీయంగా చూస్తే.. ఈ సూచీలు.. ఇప్పటికే పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి.

గోల్డ్ పై ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఇది రైట్ టైమ్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. నష్టాలను తట్టుకోవడానికి ఇది కరెక్ట్ సాధనంగా చెబతారు. అందుకే బంగారాన్ని కొనడంతోపాటు గోల్డ్ ఈటీఎఫ్ లను కూడా కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. పైగా వీటిలో అయితే రూ.1000 నుంచి కూడా మదుపు చేయవచ్చు. దీనికి డీమ్యాట్ అకౌంట్ కూడా అక్కర్లేదు. రెగ్యులర్ గా పెట్టుబడులు పెట్టేవాళ్లు తమ మదుపులో 10-15 శాతాన్ని బంగారం కోసం కేటాయించవచ్చు.

బంగారం రేటు పెరుగుతున్నా సరే.. గ్రౌండ్ లెవల్లో పెద్దగా లేదు. ఎందుకంటే విజయవాడ లాంటి నగరంలోనే రోజుకు 50 నుంచి 60 కేజీల బంగారాన్ని అమ్ముతారు. ఇప్పుడేమీ సీజన్ లేకపోవడంతో ఎవరూ కొనడం లేదు. మళ్లీ శ్రావణమాసంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఉంటాయి కాబట్టి అప్పుడు రేటు పెరగవచ్చు. కరోనా దెబ్బ వల్ల చాలామంది తమ దగ్గర ఉన్న పుత్తడిని అమ్ముతున్నారు. ఒకవేళ యుద్ధం కాని మరో 10 రోజుల నుంచి నెల రోజుల వరకు ఉంటే గ్రాముకు రూ.200 పెరిగే ఛాన్సుంది. యుద్ధ భయం లేకపోతే మాత్రం గ్రాముకు రూ.400 తగ్గే ఛాన్సుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇంకా జరిగినా సరే.. ఔన్స్ ధర 2000 డాలర్లకు మించి ఉండకపోవచ్చు. ఆమేరకు వివిధ దేశాలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయినాసరే.. మనదేశంలో పది గ్రాముల పుత్తడి రేటు రూ.56,000 ఉండొచ్చని అంచనా. సో.. బంగారాన్ని కొనాలంటే మాత్రం ఇప్పుడు ఓ లుక్కేయవచ్చంటున్నారు నిపుణులు.